Vermicelli Idli : సాధారణంగా మనకు సేమ్యా అనగానే పాయసం లేదా సేమ్యా ఉప్మా గుర్తొస్తాయి. ఒకప్పుడు ఏదైనా పండగ వచ్చిందంటే చాలు చాలా మంది ఇల్లలో సేమ్యా పాయసం కచ్చితంగా తయారుచేసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎన్నో రకాల స్వీట్లు, చిరు తిళ్లు అలాగే అన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ల వల్ల చాలా మంది ఇంట్లో సేమ్యా చేసుకోవడమే తగ్గించేశారు. సేమ్యాను పాయసం లేదా ఉప్మాలా మాత్రమే కాకుండా ఇంకా వివిధ రకాలుగా వండుకోవచ్చు. వాటిలో ఒకటి సేమ్యా ఇడ్లీ. కాబట్టి ఇప్పుడు మనం సేమ్యా ఇడ్లీ ఎలా తయరుచేయాలో తెలుసుకుందాం.
సేమ్యా ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..
సేమ్యా – 2 కప్పులు, పెరుగు- 1 కప్పు, పచ్చిమిర్చి- 3, అల్లం ముక్క చిన్నది – 1, కొత్తిమీర- 1 కట్ట, క్యారెట్లు- 3, ఆవాలు- 1 టీ స్పూన్, నూనె- సరిపడా, ఉప్పు- తగినంత, శనగపప్పు-1 టేబుల్ స్పూన్.
సేమ్యా ఇడ్లీని తయారు చేసే విధానం..
ఒక గిన్నె లో పెరుగు తీసుకొని అందులో క్యారెట్ తురుము, తగినంత ఉప్పు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ ను స్టవ్ పైన పెట్టుకొని నూనె పోసి కాస్త వేడి అయ్యాక ఆవాలు వేసి వేయించాలి. తరువాత శనగపప్పు వేయాలి. కాసేపు వేగిన తరువాత సేమ్యా వేసి గోధుమరంగులోకి మారే వరకు వేయించాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమం వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టాలి. పావుగంట చల్లారిన తరువాత కొత్తిమీర వేసి కలపాలి. ఇడ్లీ పాత్రకు నూనె రాసి అందులో సేమ్యా మిశ్రమాన్ని వేయాలి. ఇడ్లీ కుక్కర్ లో 10 నుండి 12 నిమిషాల పాటు ఉడికించాలి. ఆవిరి తీసేసిన తరువాత సేమ్యా ఇడ్లీలను బయటకు తీయాలి. వీటిని టమాట లేదా పల్లీ చట్నీతో తింటే భలే రుచిగా ఉంటాయి.