Weight Gain Food : వెయిట్ గెయిన్ ఫుడ్.. ఆపిల్, బనానాతో చేసే ఫుడ్ చాలా రుచిగా ఉంటుంది. సంవత్సరం పైబడిన పిల్లలకు దీనిని ఆహారంగా ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. అలాగే వారికి కావల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయి. ఈ ఆహారాన్ని పిల్లలకు ఇవ్వడం వల్ల సన్నగా ఉన్న పిల్లలు బలంగా, ధృడంగా తయారవుతారు. నీరసం, బలహీనత వంటి సమస్యలు వారి దరి చేరకుండా ఉంటాయి. ఈ ఫుడ్ ను తయారు చేయడం చాలా తేలిక. ఆపిల్, అరటిపండు ఉంటే చాలు ఈ ఫుడ్ ను చిటికెలో తయారు చేసుకోవచ్చు. పిల్లలకు చక్కటి ఆరోగ్యాన్ని , పోషణను అందించే ఈ వెయిట్ గెయిన్ ఫుడ్ ను ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
వెయిట్ గెయిన్ ఫుడ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఆపిల్ – 1, నానబెట్టిన బాదంపప్పు – 2, నీళ్లు – అర గ్లాస్, పండిన అరటిపండు – 1, నెయ్యి – అర టీ స్పూన్.
వెయిట్ గెయిన్ ఫుడ్ తయారీ విధానం..
ముందుగా ఆపిల్ పైఉండే పొట్టును తీసి వేయాలి. తరువాత దీనిలో ఉండే గింజలను కూడా తీసేసి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత బాదంపప్పు పై ఉండే పొట్టును తీసేసి వీటిని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో నీటిని తీసుకుని అందులో ఆపిల్ ముక్కలు, బాదంపప్పు వేసి మూత పెట్టి ఉడికించాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా అయ్యే వరక ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఇవి పూర్తిగా చల్లారిన తరువాత ఒక జార్ లో అరటిపండును ముక్కలుగా చేసి వేసుకోవాలి. తరువాత ఇందులోనే ఉడికించిన ఆపిల్ ముక్కలు, నెయ్యి వేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెయిట్ గెయిన్ ఫుడ్ తయారవుతుంది. దీనిని ఉదయం పూట లేదా సాయంత్రం సమయంలో పిల్లలకు ఇవ్వడం వల్ల వారికి తగిన పోషకాలు అలాగే చక్కటి ఆరోగ్యం అందుతుంది.