Wheat Flour Mysore Bajji : మనం అల్పాహారంగా అప్పుడప్పుడూ మైసూర్ బజ్జీలను కూడా తయారు చేసుకుని తింటూ ఉంటాం. మైసూర్ బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. మనకు బయట బండ్ల మీద, టిఫిన్ సెంటర్లల్లో కూడా మైసూర్ బజ్జీలు లభిస్తూ ఉంటాయి. అయితే మైసూర్ బజ్జీలను తయారు చేసుకోవడానికి గానూ మనం మైదాపిండిని ఉపయోగిస్తూ ఉంటాం. ఈ మైదాపిండి మన ఆరోగ్యానికి ఎంతో హానిని కలిగిస్తుంది. దీనితో తయారు చేసిన వంటకాలను తినడం వల్ల అనారోగ్య సమస్యలతో బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మైదాపిండి కాకుండా గోధుమపిండితో కూడా మనం ఎంతో రుచిగా ఉండే మైసూర్ బజ్జీలను తయారు చేసుకోవచ్చు. గోధుమపిండితో చేసే ఈ మైసూర్ బజ్జీలను తినడం వల్ల మనం రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. రుచిగా గోధుమపిండితో మైసూర్ బజ్జీలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమపిండి మైసూర్ బజ్జీ తయారీకి కావల్సిన పదార్థాలు..
వంటసోడా – ఒక టీ స్పూన్, పెరుగు – ముప్పావు కప్పు, పంచదార – ఒక టీ స్పూన్, ఉప్పు – ఒకటింపావు టీ స్పూన్, బొంబాయి రవ్వ – 2 టేబుల్ స్పూన్స్, గోధుమపిండి – 400 గ్రా., నీళ్లు – అర లీటర్ లేదా తగినన్ని, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, జీలకర్ర – ఒక టీ స్పూన్, తరిగిన కరివేపాకు – రెండురెబ్బలు, చిన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ప్రైకు సరిపడా.
గోధుమపిండి మైసూర్ బజ్జీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో వంటసోడా, పెరుగు వేసి బాగా కలపాలి. తరువాత ఇందులో ఉప్పు, బొంబాయి రవ్వ, పంచదార వేసి కలపాలి. తరువాత గోధుమపిండి, నీళ్లు పోసి కలపాలి. పిండిని చక్కగా కలుపుకున్న తరువాత 5 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి. తరువాత పిండిని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఇందులో జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మరో రెండు నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి. తరువాత అడుగు లోతుగా ఉండే కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక పిండిని చేతికి తడి చేసుకుంటూ ఒక అంచు నుండి పిండిని తీసుకుంటూ గుండ్రంగా బోండాలను వేసుకోవాలి.
ఈ బోండాలను కదుపుతూ మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమపిండి మైసూర్ బజ్జీ తయారవుతుంది. వీటిని చట్నీ, సాంబార్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసుకున్న గోధుమపిండి మైసూర్ బజ్జీలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని తినడం వల్ల రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా హాని కలగకుండా ఉంటుంది.