Wheat Rava Khichadi : గోధుమ రవ్వతో కిచిడీ.. రుచికరం.. ఆరోగ్యకరం..

Wheat Rava Khichadi : గోధుమలతో చాలా మంది చపాతీలను తయారు చేసుకుని తింటుంటారు. అయితే ఎప్పుడూ చపాతీలే కాకుండా వెరైటీని కోరుకునే వారు గోధుమ రవ్వతోనూ వంటకాలు చేసుకోవచ్చు. ఈ రవ్వతో చేసేవి ఏవైనా సరే రుచిగానే ఉంటాయి. ఇక దీంతో కిచిడీని తయారు చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. పైగా ఆరోగ్యకరమైనది కూడా. దీన్ని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ లేదా మధ్యాహ్నం లంచ్‌.. రాత్రి డిన్నర్‌లలో.. ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు. కాస్త తినగానే కడుపు నిండిపోతుంది. పెద్దగా ఆకలి వేయదు. దీని వల్ల బరువు తగ్గడం కూడా తేలికవుతుంది. ఇక గోధుమ రవ్వతో కిచిడీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Wheat Rava Khichadi easy to make very healthy
Wheat Rava Khichadi

గోధుమ రవ్వతో కిచిడీ తయారీకి కావల్సిన పదార్థాలు..

గోధుమ రవ్వ – ఒకటిన్నర కప్పు, పెసరపప్పు – పావు కప్పు, అల్లం తరుగు – అర టీస్పూన్‌, లవంగాలు – రెండు, బిర్యానీ ఆకు – ఒకటి, యాలకులు – రెండు, ఎండు మిర్చి – రెండు, పచ్చి మిర్చి – రెండు, నెయ్యి – పావు కప్పు, ఆవాలు – ఒక టీస్పూన్‌, జీలకర్ర – ఒక టీస్పూన్‌, కరివేపాకు రెబ్బలు – రెండు, ఉల్లిపాయ – ఒకటి, టమాటా – ఒకటి, పచ్చి బఠానీ – అర కప్పు, క్యారెట్‌ – ఒకటి, బంగాళా దుంపలు – రెండు, బీన్స్‌ – అయిదు, ఉప్పు – తగినంత, పసుపు – అర టీస్పూన్‌, కారం – పావు టీస్పూన్‌.

గోధుమ రవ్వ కిచిడీని తయారు చేసే విధానం..

కుక్కర్‌ని స్టవ్‌ మీద పెట్టి నెయ్యి వేయాలి. అది కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు వేసి వేయించి.. పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు వేయాలి. నిమిషం అయ్యాక కూరగాయ ముక్కలన్నీ వేసి బాగా వేయించాలి. ఇందులో తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి కలిపి నాలుగున్నర కప్పుల నీళ్లు పోసి.. పెసరపప్పు, గోధుమ రవ్వ వేసి మూత పెట్టి నాలుగు విజిల్స్‌ వచ్చాక స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. వడ్డించే ముందు దీనిపైన కొద్దిగా నెయ్యి వేస్తే చాలు.. వేడి వేడి గోధుమ రవ్వ కిచిడీ సిద్ధమైపోతుంది. దీన్ని ఎప్పటికప్పుడు చేసుకుని తింటేనే వేడిగా.. తాజాగా ఉంటుంది. అనేక పోషకాలు లభిస్తాయి. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.

Admin

Recent Posts