White Chicken Pulao : చికెన్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు చికెన్ ను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. చికెన్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో వైట్ చికెన్ పులావ్ కూడా ఒకటి. ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు, మొదటిసారి చేసేవారు, బ్యాచిలర్స్ కూడా దీనిని చాలా సులభంగా, చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ వైట్ చికెన్ పులావ్ ను సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వైట్ చికెన్ పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – అరకిలో, నిమ్మరసం – అర చెక్క, ఉప్పు – తగినంత, ధనియాలు -ఒక టేబుల్ స్పూన్, మిరియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర -అర టీ స్పూన్, పచ్చిమిర్చి – 8, అల్లం – రెండు ఇంచుల ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 15,నానబెట్టిన బాస్మతీబియ్యం – రెండు గ్లాసులు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 5, యాలకులు – 4, అనాస పువ్వు – 1, జాపత్రి – కొద్దిగా, స్టోన్ ప్లవర్ – కొద్దిగా, మరాఠీ మొగ్గ – 1, బిర్యానీ ఆకులు – 2, సాజీరా – ఒక టీ స్పూన్, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ- పెద్దది ఒకటి, బిర్యానీ మసాలా -ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, పెరుగు – అర కప్పు, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – పావు కప్పు.
వైట్ చికెన్ పులావ్ తయారీ విధానం..
ముందుగా చికెన్ లో తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 20 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత జార్ లో ధనియాలు, మిరియాలు, జీలకర్ర వేసి మెత్తగా మిక్సీపట్టుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదేజార్ లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు కుక్కర్ లో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులన్నింటిని వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి. వీటిని ఎర్రగా అయ్యే వరకు వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమం వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత చికెన్ వేసి కలపాలి. ఈ చికెన్ 4 నిమిషాల పాటు వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న పొడి, బిర్యానీ మసాలా, గరం మసాలా వేసి కలపాలి. తరువాత పెరుగు వేసి కలపాలి.
అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసి కలపాలి. ఇప్పుడు పావు కప్పు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత తీసి మరలా స్టవ్ ఆన్ చేసి నానబెట్టిన బియ్యం వేసికలపాలి. తరువాత రెండు గ్లాసుల నీళ్లు పోసి తగినంత ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని ఆవిరి పోయేంత వరకు అలాగే ఉంచిన తరువాత మూత తీసి అంతా కలిసేలా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వైట్ చికెన్ పులావ్ తయారవుతుంది. చికెన్ తో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.