Protein Deficiency Symptoms : మన శరీరానికి అవసరమైన పోషకాల్లో ప్రోటీన్ కూడా ఒకటి. జుట్టు పెరుగుదలకు, కండరాల పెరుగుదలకు, కండరాలు ధృడంగా తయారవ్వడానికి ఇలా అనేక రకాలుగా ప్రోటీన్ మనకు అవసరమవుతుంది. ప్రోటీన్ మన శరీరంలో అనేక విధులను నిర్వర్తిస్తుంది. శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. అయితే మనలో చాలా మంది ఈ మధ్య కాలంలో ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారు. శరీరంలో ప్రోటీన్ లోపించడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అలాగే జుట్టు కూడా ఎక్కువగా ఊడిపోతుంది. కొన్ని సందర్భాల్లో మనం తీవ్ర అనారోగ్యానికి కూడా గురి కావాల్సి వస్తుంది. మన శరీర బరువులో కిలోకి 0.8 గ్రాముల చొప్పున ప్రోటీన్ అవసరమవుతుంది. కానీ మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారు. శరీరంలో ప్రోటీన్ లోపం తలెత్తినప్పుడు శరీరం మనకు సంకేతాలను సూచిస్తుంది.
కానీ చాలా మంది ఈ సంకేతాలను గుర్తించలేక సమస్యను మరింత తీవ్రతరం చేసుకుంటూ ఉంటారు. కనుక ఈ సంకేతాల గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం. శరీరంలో ప్రోటీన్ లోపించడం వల్ల మనలో కనిపించే సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోటీన్ లోపించడం వల్ల మనం తరుచూ అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది.కణజాల నిర్మాణానికి, వాటి మరమత్తుకు ప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్ లోపించడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. తరుచూ ఇన్పెక్షన్ ల బారిన పడినట్టు గమనించినట్టయితే ప్రోటీన్ లోపానికి సంకేతంగా భావించాలి. అలాగే చర్మం మరియు జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్ లోపించడం వల్ల జుట్టు రాలడంతో పాటు చర్మం పొడిబారుతుంది. చర్మంపై పొట్టు ఊడిపోతుంది.
అలాగే ప్రోటీన్ లోపించడం వల్ల శరీరంలో ద్రవసమతుల్యం దెబ్బతింటుంది. దీంతో శరీరంలో నీరు చేరి వాపులు కనిపిస్తాయి.ఈ వాపు ఎక్కువగా చేతులు, కాళ్లు, కాలి మడమల దగ్గర వస్తుంది. వాపును ఎక్కువగా గమనించినట్టయితే ప్రోటీన్ లోపానికి సంకేతంగా భావించాలి. అదే విధంగా ప్రోటీన్ లోపించడం వల్ల కండరాల క్షీణత వస్తుంది. కండరాలు బలహీనంగా తయారవుతాయి. కొద్దిపాటి శారీరక శ్రమ చేసినప్పటికి కండరాలు తీవ్రంగా నష్టపోతాయి. అలాగే ఎముకల అభివృద్దికి కూడా ప్రోటీన్ చాలా అవసరం. శరీరంలో ప్రోటీన్ లోపించడం వల్ల ఎముకల పెరుగుదల తగ్గుతుంది. ఎముకలు బలహీనంగా తయారవుతాయి. ఎముకల సాంద్రత తగ్గడంతోపాటు ఎముకలు బోలుగా, పెళుసులుగాతయారవుతాయి.
అలాగే పిల్లలకు, కౌమార దశలో ఉన్న పిల్లలకుప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్ లోపించడం వల్ల పిల్లల్లో ఎదుగుదల తగ్గుతుంది. అలాగే ఆకలిని అదుపులో ఉంచడంలో జీవక్రియలు సక్రమంగా జరిగేలా చేయడంలో కూడా ప్రోటీన్ కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంలో ప్రోటీన్ లోపించడం వల్ల విపరీతంగా బరువు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. అలాగే ప్రోటీన్ లోపించడం వల్ల హైపోఅల్బుమినిమియా అని పిలవబడే రక్తహీనత సమస్య తలెత్తుతుంది. తద్వారా అలసట, బలహీనత వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ విధంగా ఈ సంకేతాలను బట్టి శరీరంలో ప్రోటీన్ లోపం ఉన్నదని భావించాలి. దీనిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించడంతో పాటుగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకునే ప్రయత్నం చేయాలి.