Vitamin D Deficiency : మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో విటమిన్ డి కూడా ఒకటి. విటమిన్ డి మన శరీరంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎముకలను, దంతాలను ఆరోగ్యంగా ఉంచడంలో, ఫ్లూ బారిన పడకుండా చేయడంలో, టైప్ 1 డయాబెటిస్ బారిన పడకుండా చేయడంలో, క్యాన్సర్ అవకాశాలను తగ్గించడంలో, ఒత్తిడిని మరియు ఆందోళనను దూరం చేయడంలో, శరీరం పోషకాలను చక్కగా గ్రహించేలా చేయడంలో ఇలా అనేక రకాలుగా విటమిన్ డి మనకు సహాయపడుతుంది. ఎండలో కూర్చోవడం వల్ల మన శరీరానికి తగినంత విటమిన్ డి లభిస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. అయితే నేటి తరుణంలో మనలో చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. విటమిన్ డి లోపించడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే కొన్ని లక్షణాలను బట్టి మనం ముందుగానే విటమిన్ డి లోపాన్ని గుర్తించవచ్చు.
ఈ లక్షణాలను బట్టి మనం ముందుగానే జాగ్రత్తపడడం చాలా అవసరం. లేదంటే మనం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి ఉంటుంది. విటమిన్ డి లోపం కారణంగా మనలో కనిపించే లక్షణాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ డి లోపం వల్ల నోటిలో మంటగా ఉండడంతో పాటు నోరు తిమ్మిరిగా కూడా ఉంటుంది. తీవ్రమైన నొప్పితో పాటు నోరు కూడా పొడిబారుతుంది. ఈ పరిస్థితి ఉన్నటుండి రాదు. కాలక్రమేణా నెమ్మదిగా ఈ సమస్య తీవ్రమవుతుంది. నోటిలో మంటతో పాటు నాలుక రుచి మారడం, నాలుక పూర్తిగా రుచిని కోల్పోవడం, అలాగే నాలుకపై చిన్న చిన్న బొబ్బలు రావడం కూడా జరుగుతుంది. అలాగే విటమిన్ డి లోపం కారణంగా శరీరంలో క్యాల్షియం స్థాయిలు తగ్గుతాయి. అలాగే నాలుక స్పర్శను కోల్పోతుంది. విటమిన్ డి లోపం వల్ల నోరు పూర్తిగా ఎండిపోతుంది. నోరు ఎండిపోవడం వల్ల దంతాల సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి.
విటమిన్ డి లోపం తీవ్రమయ్యే కొద్ది ఇన్ ప్లామేషన్ తో పాటు న్యుమోనియా, శ్వాసకోస సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది కనుక విటమిన్ డి లోపాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడం చాలా అవసరం. విటమిన్ డి లోపాన్ని అధిగమించాలంటే మనం రోజూ 10 నుండి 20 నిమిషాల పాటు ఎండలో కూర్చోవడం చాలా అవసరం. అలాగే విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. పాలకూర, బెండకాయ, సోయాబీన్స్, చేపలు, చేప నూనె, కోడిగుడ్లు, పాల ఉత్పత్తులు, పుట్ట గొడుగులు, చీస్ వంటి వాటిని తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత విటమిన్ డి లభిస్తుంది. ఈ ఆహారాలను తీసుకుంటూ రోజూ ఎండలో కూర్చోవడం వల్ల విటమిన్ డి లోపాన్ని మనం చాలా సులభంగా అధిగమించవచ్చు.