Vitamin D In Rainy Season : మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్ లో విటమిన్ డి కూడా ఒకటి. విటమిన్ డి మన శరీరంలో ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది. ఎముకలను ధృడంగా ఉంచడంలో, ఎముకలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు రాకుండా చేయడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, కండరాలను, నరాలను ఆరోగ్యంగా ఉంచడంలో, అవి సక్రమంగా పని చేసేలా చేయడంలో ఇలా అనేక రకాలుగా విటమిన్ డి మనకు సహాయపడుతుంది. మన శరీరంలో తగినంత విటమిన్ డి ఉండడం చాలా అవసరం. లేదంటే మనం వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఎండలో కూర్చోవడం వల్ల మన శరీరానికి తగినంత విటమిన్ డి లభిస్తుందని మనందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం మనం వర్షాకాలంలో ఉన్నాము.
దీంతో తగినంత సూర్యరశ్మి ఉండదు. మన శరీరంపై నేరుగా కూడా ఎండ పడదు. దీంతో మన శరీరంలో విటమిన్ డి లోపం తలెత్తే అవకాశం ఉంది. విటమిన్ లోపం రాకుండా వర్షాకాలంలో సూర్యరశ్మి లేని సమయంలో మన శరీరానికి విటమిన్ డి ని ఎలా అందించాలి.. మన శరీరంలో విటమిన్ డి లోపం రాకుండా ఎలా చూసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వయసును బట్టి ప్రతి ఒక్కరికి ప్రతిరోజూ 10 నుండి 20 మైక్రో గ్రాముల విటమిన్ డి అవసరమవుతుంది. కనుక వర్షాకాలంలో మనం ఎక్కువగా విటమిన్ డి ఉండే ఆహారాలను తీసుకోవాలి. పుట్టగొడుగులు, చేపలు, గుడ్లు, పాలు, తృణ ధాన్యాలు, నారింజ పండ్ల రసం వంటి వాటిని తీసుకోవాలి. ఒకవేళ ఈ ఆహారాలను తీసుకోలేని వారు విటమిన్ డి లోపంతో బాధపడే వారు విటమిన్ డి సప్లిమెంట్ లను తీసుకోవాలి. అయితే చాలా మంది అవసరం లేకున్న కూడా విటమిన్ డి సప్లిమెంట్ లను తీసుకుంటూ ఉంటారు.
శరీరంలో విటమిన్ డి ఎక్కువగా ఉన్నా కూడా మన శరీరానికి హాని కలుగుతుంది. విటమిన్ డి ఎక్కువగా ఉండడం వల్ల వాంతులు, వికారం, బలహీనత, మూత్రవిసర్జన ఎక్కువగా చేయడం, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడం వంటి సమస్యలు తలెత్తుతాయి కనుక తగిన మోతాదులో మాత్రమే విటమిన్ డి సప్లిమెంట్స్ ను తీసుకోవాలి. విటమిన్ డి లోపం ఉండో లేదో తెలుసుకోవడానికి రక్తపరీక్షలు చేయించుకోవాలి. విటమిన్ డి సప్లిమెంట్స్ అవసరమైనప్పుడు మాత్రమే వైద్యున్ని సంప్రదించి వాటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సూచనలను పాటించడం వల్ల మనం మన శరీరంలో విటమిన్ డి లోపం రాకుండా చూసుకోవచ్చు.