Vitamins For Hair : ప్రస్తుత తరుణంలో చాలా మంది జుట్టు సమస్యలతో సతమతం అవుతున్నారు. చుండ్రు, జుట్టు రాలడం, శిరోజాలు బలహీనంగా మారి చిట్లిపోవడం, జుట్టు తెల్లగా మారడం.. వంటి అనేక జుట్టు సమస్యలు చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అయితే జుట్టు సమస్యలు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అధిక ఒత్తిడి, ఆందోళన, దీర్ఘకాలికంగా అనారోగ్యాలకు మందులను వాడడం, వంశ పారంపర్యత, పోషకాహార లోపం వంటి కారణాల వల్ల జుట్టు సమస్యలు వస్తుంటాయి. అయితే ఇతర కారణాలను పక్కన పెడితే చాలా మందికి పోషకాహార లోపం వల్లనే జుట్టు సమస్యలు వస్తుంటాయి. దీన్నుంచి బయట పడితే జుట్టు సమస్యలు వాటంతట అవే తగ్గిపోతాయి. కనుక ముందుగా పోషకాహారం తీసుకునే అలవాటు చేసుకోవాలి.
ముఖ్యంగా పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల జుట్టు సమస్యలు రాకుండా ఉంటాయి. కొన్ని రకాల విటమిన్లు ఉండే ఆహారాలను తింటే జుట్టు సమస్యలు రావు. ఉన్నా తగ్గిపోతాయి. ఇక మనకు ఉండే జుట్టు సమస్యలను తగ్గించే విటమిన్లలో విటమిన్ సి ముఖ్యమైనది. ఇది మన శరీరంలో కొల్లాజెన్ అనే ప్రోటీన్‌ను ఉత్పత్తి చేసేందుకు సహాయ పడుతుంది. జుట్టు ఎదుగుదలలో కొల్లాజెన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కనుక విటమిన్ సి ఉండే ఆహారాలను మనం తీసుకోవాలి. దీని వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి తద్వారా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇక మనకు విటమిన్ సి నిమ్మజాతి పండ్లలో అధికంగా లభిస్తుంది. అలాగే ద్రాక్ష, బొప్పాయి, కివీ, క్యాప్సికం, టమాటా వంటి కూరగాయలు, పండ్లను తిన్నా మనకు విటమిన్ సి లభిస్తుంది. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడుతుంది. కనుక విటమిన్ సి ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాలి.
మన జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా మనకు సహాయపడతాయి. విటమిన్ బి1 (థయామిన్), బి2 (రైబోఫ్లేవిన్), బి3 (నియాసిన్), బి5 (పాంటోథెనిక్ యాసిడ్), బి6 (పైరిడాక్సిన్), బి7 (బయోటిన్), బి9.. ఇలా బి కాంప్లెక్స్ విటమిన్లు మనకు రోజూ లభించేలా చూసుకోవాలి. ఇవి మనకు వచ్చే పలు రకాల జుట్టు సమస్యలను తగ్గిస్తాయి. ఈ విటమిన్లు మనకు ముఖ్యంగా.. మాంసం, చేపలు, పాలు, చీజ్, కోడిగుడ్లు, నట్స్, ఆకుకూరలు, తృణ ధాన్యాలు, చిరు ధాన్యాలలో అధికంగా లభిస్తాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే జుట్టు సమస్యల నుంచి బయట పడవచ్చు.
మన శరీరానికి విటమిన్లు మాత్రమే కాదు.. మినరల్స్ కూడా అవసరమే. అలాంటి వాటిల్లో జింక్ ఒకటి. ఇది మన శరరీంలో పలు రకాల విధులకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జుట్టును దృఢంగా ఉంచడంలో జింక్ సహాయ పడుతుంది. జుట్టు బలహీనంగా ఉందంటే.. జింక్ లోపం ఉందని అర్థం చేసుకోవాలి. కనుక జింక్ ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. మనకు జింక్ ఎక్కువగా.. పెరుగు, పాలు, గుమ్మడి కాయ విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, పుట్ట గొడుగులు, ఓట్స్, పీతలు, శనగలు వంటి వాటిల్లో లభిస్తుంది. వీటిని ఆహారంలో తీసుకుంటే అసలు జుట్టు సమస్యలే ఉండవు. జుట్టు బలంగా ఉంటుంది. విరిగిపోయిన జుట్టు చివర్లు కూడా బలంగా మారి అందంగా కనిపిస్తాయి. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
ఐరన్ వల్ల మన శరీరం ఎర్ర రక్త కణాలను తయారు చేసుకుంటుందన్న విషయం తెలిసిందే. దీంతో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. అయితే ఐరన్ వల్ల కేవలం రక్తం బాగా తయారవడమే కాదు.. జుట్టు కూడా బలంగా మారుతుంది. జుట్టుకు ఇతర పోషకాలు సరిగ్గా అందాలంటే అందుకు ఐరన్ ఉండాలి. ఐరన్ వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు సరిగ్గా ఉంటాయి. దీని వల్ల రక్తం ద్వారా జుట్టుకు కావల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. కనుక జుట్టుకు పోషకాలు అన్నీ లభించాలంటే ఐరన్ ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఐరన్ మనకు ఎక్కువగా.. ఎరుపు రంగులో ఉండే పండ్లు, కూరగాయలు, ఖర్జూరాలు, మాంసం, పప్పు దినుసులు, ఆకుకూరలు, తృణ ధాన్యాలు, గుమ్మడి కాయ విత్తనాల్లో లభిస్తుంది. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే ఐరన్ సరిగ్గా లభిస్తుంది. దీంతో జుట్టుకు ఇతర పోషకాలు కూడా సరిగ్గా అందుతాయి. అప్పుడు అన్ని రకాల జుట్టు సమస్యలు తగ్గుతాయి. కనుక ఐరన్ ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక మన జుట్టు సమస్యలకు ఉపయోగడే విటమిన్లలో విటమిన్ డి కూడా ఒకటి. ఇది కొత్త వెంట్రుకలు పెరిగేలా చేస్తుంది. అలాగే విటమిన్ ఇ కూడా మనకు ఉపయోగపడుతుంది. విటమిన్ ఇ వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. శిరోజాలు కాంతివంతంగా మారుతాయి. మనకు విటమిన్ డి సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. రోజూ ఉదయం 7 గంటల సమయంలో 20 నిమిషాల పాటు శరీరం కనీసం 60 శాతం వరకు సూర్యరశ్మి తగిలేలా ఉండాలి. దీంతో చర్మం కింద ఉండే కొవ్వులో విటమిన్ డి తయారవుతుంది. ఇది మనకు సరిపోతుంది. ఇక విటమిన్ డి మనకు కోడిగుడ్లు, నట్స్, పుట్టగొడుగులు వంటి ఆహారాల ద్వారా కూడా లభిస్తుంది. అలాగే విటమిన్ ఇ మనకు ఎక్కువగా గింజల్లో లభిస్తుంది. చియా విత్తనాలు, పొద్దు తిరుగుడు లేదా గుమ్మడి కాయ విత్తనాలను తినడం వల్ల విటమిన్ ఇ లభిస్తుంది. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే విటమిన్ ఇని పొందవచ్చు. దీంతో జుట్టు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటుంది.