Guava : జామకాయలు మనకు సీజన్లలోనే అందుబాటులో ఉంటాయి. ఇవి మనకు సీజన్ సమయంలో ఎక్కడ చూసినా లభిస్తాయి. వివిధ రకాల జామకాయలు మనకు అందుబాటులో ఉంటాయి. అయితే హైబ్రిడ్ కాయల కన్నా లోకల్‌గా పండిన కాయలను తింటేనే మనకు ఎక్కువ లాభాలు కలుగుతాయి. జామకాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జామకాయలు మాత్రమే కాకుండా జామ ఆకులు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం.. జామ కాయలు లేదా జామ ఆకుల నీళ్లను రోజూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణశక్తి మెరుగు పడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే జామకాయల వల్ల మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ వీటిని మోతాదుకు మించి మాత్రం తినకూడదని నిపుణులు చెబుతున్నారు.
జామకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం అధికంగా ఉంటాయి. ఒక మీడియం సైజ్ జామకాయ ద్వారా మనకు సుమారుగా 112 క్యాలరీల శక్తి లభిస్తుంది. 23 గ్రాముల కార్బొహైడ్రేట్లు లభిస్తాయి. అలాగే 9 గ్రాముల ఫైబర్ వస్తుంది. 4 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం.. డయాబెటిస్ ఉన్నవారు జామకాయలను తింటే ఎక్కువ మేలు పొందవచ్చు. కారణం ఈ కాయల్లో తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉండడమే అని చెప్పవచ్చు. అందువల్ల షుగర్ లెవల్స్ పెరగవు. ఈ కాయల్లో ఉండే బీటా కెరోటీన్, ఇతర పోషకాలు మనకు ఎంతగానో మేలు చేస్తాయి.
అయితే గ్యాస్ సమస్య ఉన్నవారు మాత్రం జామకాయలను తక్కువగా తినాలి. ఎందుకంటే ఈ కాయల్లో విటమిన్ సి, ఫ్రక్టోజ్ అధికంగా ఉంటాయి. వీటి డోస్ ఎక్కువైతే గ్యాస్ సమస్య మరింత పెరుగుతుంది. కాబట్టి ఇప్పటికే ఈ సమస్య ఉన్నవారు జామకాయలను తినడంలో జాగ్రత్త వహించాలి. అలాగే ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే సమస్య ఉన్నవారు కూడా జామకాయలను తినరాదు. వీరికి విరేచనాలు అవుతుంటాయి. జామకాయలు విరేచనాలను ప్రోత్సహిస్తాయి. కనుక ఈ సమస్య ఉన్నవారు కూడా జామకాయలను తినరాదు. అలాగే డయాబెటిస్ ఉన్నవారు జామ పండ్లను కాకుండా కాస్త పచ్చిగా ఉండే కాయలను తినాలి. వీటిల్లో చక్కెర అంతగా ఉండదు. దీంతోపాటు షుగర్ లెవల్స్ కూడా తగ్గుతాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు కాస్త దోరగా ఉండే కాయలను తింటే మేలు జరుగుతుంది.
ఇక జామ కాయలు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. కానీ వీటిని రోజుకు రెండు లేదా మూడుకు మించి తినరాదు. అధికంగా తింటే విరేచనాలు, గ్యాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే.. అతిగా తింటే సమస్యలు వస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. జామకాయల వల్ల లాభాలను పొందాలంటే వీటిని రోజుకు రెండు లేదా మూడు వరకు మాత్రమే తినాలి. అతిగా తినకూడదు.