Categories: పండ్లు

నారింజ పండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఇవే..!

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో విస్తృతంగా లభించే పండ్లలో నారింజ పండు ఒకటి. నారింజ పండ్లను స్నాక్స్‌ రూపంలో తినవచ్చు. జ్యూస్‌లా చేసుకుని తీసుకోవచ్చు. అనారోగ్య సమస్యలు ఉన్నవారికి నారింజ పండ్లను తినమని ఇస్తుంటారు. నారింజ పండ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ పండ్లను రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

health benefits of oranges

1. నారింజ పండ్లలో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ పండ్లను తింటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పెద్ద పేగు క్యాన్సర్‌ రాకుండా ఉంటుంది. శరీరానికి నష్టం చేసే ఫ్రీ ర్యాడికల్స్‌ నాశనం అవుతాయి.

2. నారింజ పండ్లను తీసుకోవడం వల్ల జలుబు, చెవి ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. చర్మం దెబ్బతినకుండా ఉంటుంది. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కనుక వీటిని తరచూ తింటే యవ్వనంగా కనిపిస్తారు. వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావు.

3. హైబీపీ సమస్య ఉన్నవారు రోజూ నారింజ పండ్లను తినాలి. వీటిల్లో విటమిన్‌ బి6 అధికంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేసేందుకు సహాయ పడుతుంది. దీంతోపాటు బీపీని అదుపులో ఉంచుతుంది.

4. నారింజ పండ్లను రోజూ తినడం వల్ల శరీరంలో ఉండే కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. ఈ విషయాన్ని అమెరికా, కెనడాలకు చెందిన సైంటిస్టులు పరిశోధనల్లో తేల్చారు.

5. డయాబెటిస్‌తో బాధపడేవారు నారింజ పండ్లను తీసుకోవడం వల్ల వారి షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటాయి. నారింజ పండ్లను తినకూడదని మధుమేహం ఉన్నవారు అపోహలకు గురవుతారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే నారింజ పండ్ల గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువ. 40 జీఐ విలువను అవి కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని తింటే షుగర్‌ స్థాయిలు పెరగవు. కాబట్టి డయాబెటిస్‌ ఉన్నవారు నిర్భయంగా వీటిని తినవచ్చు. పైగా వీటిలో ఉండే పోషకాలు చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.

6. నారింజ పండ్లలో డి-లిమోనీన్‌ అనబడే సమ్మేళనం ఉంటుంది. ఇది ఊపిరితిత్తులు, చర్మం, బ్రెస్ట్‌ క్యాన్సర్లు రాకుండా చూస్తుంది. ఈ పండ్లలో ఉండే విటమిన్‌ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్‌పై అవి పోరాటం చేస్తాయి. రోజూ నారింజ పండ్లను తినేవారికి క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు 15 శాతం వరకు తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది.

7. నారింజ పండ్లు యాసిడ్‌ స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ వాటిని తినగానే మన శరీరంలో అవి ఆల్కలైన్‌ ఆహారంగా మారుతాయి. దీంతో పలు ఆల్కలైన్‌ మినరల్స్‌ శరీరానికి అందుతాయి. ఫలితంగా జీర్ణక్రియ సులభతరం అవుతుంది.

8. నారింజ పండ్లలో విటమిన్‌ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. వయస్సు మీద పడడం వల్ల వచ్చే కంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

9. నారింజ పండ్లలో సాల్యుబుల్‌, ఇన్‌సాల్యుబుల్‌ ఫైబర్‌ రెండూ ఉంటాయి. కాబట్టి చిన్నపేగులు, జీర్ణాశయం పనితీరు మెరుగు పడుతుంది. ఇర్రిటబుల్‌ బొవెల్‌ సిండ్రోమ్‌, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి.

10. నారింజ పండ్లలో విటమిన్‌ సితోపాటు థయామిన్‌, ఫోలేట్‌, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts