Papaya Juice : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో బొప్పాయి పండు కూడా ఒకటి. మనకు అన్నీ కాలాల్లో విరివిరిగా ఈ పండు లభిస్తుంది. బొప్పాయి పండును చాలా మంది ఇష్టంగా తింటారు. ఇతర పండ్ల వలె ఈ పండు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. 100 గ్రా. ల బొప్పాయి పండులో 39 క్యాలరీల శక్తి, 9.8 గ్రా. కార్బోహైడ్రేట్స్, 1.8 గ్రా. ల ఫైబర్, 5.9 గ్రా. ల చక్కెరలు ఉంటాయి. అలాగే విటమిన్ ఎ, సి, ఇ లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫ్లోటేట్, పాంథోనిక్ యాసిడ్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. తరచూ ఈ బొప్పాయి పండును తినడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ బొప్పాయి పండును ముక్కలుగా చేసుకుని తిన్నా లేదా జ్యూస్ గా చేసుకుని తాగినా కూడా మంచి ఫలితాలను పొందవచ్చు.
బొప్పాయి పండుతో చేసే జ్యూస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. బొప్పాయి పండుతో జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా బొప్పాయి పండును శుభ్రపరిచి దానిపై ఉండే చెక్కును తీసి వేసి రెండు భాగాలుగా చేయాలి. తరువాత లోపల ఉండే గింజలను తీసేసి ముక్కలుగా చేయాలి. ఇప్పుడు ఈ ముక్కలను జార్ లో వేసుకోవాలి. ఇందులోనే కాచి చల్లార్చిన పాలు, రుచికి తగినంత తేనెను పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ జ్యూస్ ను గ్లాస్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇందులో ఐస్ క్యూబ్స్ ను కూడా వేసుకోవచ్చు. అయితే షుగర్ వ్యాధి గ్రస్తులు ఈ జ్యూస్ లో తేనెను వేసుకోకపోవడమే మంచిది. ఈ విధంగా బొప్పాయి పండుతో జ్యూస్ ను తయారు చేసుకుని తాగినా లేదా బొప్పాయి పండు ముక్కలను తిన్నా మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. బొప్పాయి పండును ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచడంలో బొప్పాయి పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే డెంగ్యూ వంటి విష జ్వరాలను తగ్గించడంలో ఈ కూడా పండు మనకు దోహదపడుతుంది. బొప్పాయి పండును తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఎముకలను ధృడంగా చేయడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో, మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేయడంలో కూడా బొప్పాయి పండు మనకు దోహదపడుతుంది. ఈ పండును తరచూ తీసుకోవడం శరీరంలో వాపులు, నొప్పులు తగ్గుతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. బరువు తగ్గడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో క్యాన్సర్ బారిన పడకుండా చేయడంలో కూడా బొప్పాయి పండు ఉపయోగపడుతుంది.
మన ఆరోగ్యానికే కాదు అందాన్ని మెరుగుపరచడంలో కూడా ఈ పండు మనకు సహాయపడుతుంది. ఒత్తిడి వంటి మానసిక సమస్యలతో ఇబ్బందిపడుతున్నప్పుడు బొప్పాయి పండును తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బొప్పాయి పండు ముక్కలను తిన్నా లేదా జ్యూస్ రూపంలో తీసుకున్నా కూడా మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చని దీనిని కూడా ఇతర పండ్ల లాగా ఆహారంగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.