Raw Papaya : మనకు తినేందుకు అనేక రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. పండ్లు అనగానే సహజంగానే వాటిల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అందువల్ల పండ్లను తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం. సీజనల్‌గా లభించే పండ్లను తినడం వల్ల సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇక బొప్పాయి వంటి పండ్లను తింటే ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇది ఏడాది పొడవునా ఏ సీజన్‌లో అయినా మనకు లభిస్తుంది. అందువల్ల బొప్పాయి పండ్లను ఎప్పుడైనా తినవచ్చు. ఈ పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. అయితే బొప్పాయి పండునే కాదు.. పచ్చి బొప్పాయిని కూడా తినవచ్చు. దీంతోనూ మనకు అనేక లాభాలు కలుగుతాయి. పచ్చి బొప్పాయిలో మన శరీరానికి అవసరం అయిన ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. విటమిన్లు సి, బి, ఇ లతోపాటు పొటాషియం, ఫైబర్, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. కనుక పచ్చి బొప్పాయిలను కూడా తినాలి. దీంతో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
ప్రస్తుత తరుణంలో చాలా మంది హార్ట్ ఎటాక్‌ల బారిన పడుతున్నారు. నిత్యం గంటల తరబడి కూర్చుని పనిచేస్తున్నారు. శారీరక శ్రమ అసలు చేయడం లేదు. ఇది చాలా మందికి ప్రాణాంతకంగా మారుతోంది. ముఖ్యంగా ఇలాంటి జీవన విధానం వల్ల గుండె జబ్బులు వస్తున్నాయి. శరీరంలో కొలెస్ట్రాల్ శాతం పెరుగుతోంది. ఇది హార్ట్ ఎటాక్‌లకు కారణం అవుతోంది. కనుక రోజూ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఇక పచ్చి బొప్పాయిలను తింటే వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు హార్ట్ ఎటాక్ లు, స్ట్రోక్స్ రాకుండా చూస్తాయి. కనుక గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
చాలా మంది మహిళలు ప్రతి నెలా రుతు సమయంలో అవస్థలు పడుతుంటారు. నొప్పి బాగా ఉంటుంది కనుక ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాంటి వారు పచ్చి బొప్పాయిని తింటే మేలు. దీంతో నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
పచ్చి బొప్పాయిలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల ఇది ఆస్తమా, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. పచ్చి బొప్పాయిలను తింటే విటమిన్ ఎ లభిస్తుంది. ఇది వాపులను తగ్గించేందుకు, ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచేందుకు పనిచేస్తుంది. కనుక పచ్చి బొప్పాయిలను తింటే నొప్పులు, వాపులను తగ్గించుకోవడంతోపాటు ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
చాలా మందికి ప్రస్తుతం జీర్ణ సమస్యలు వస్తున్నాయి. అందువల్ల పచ్చి బొప్పాయిని తింటే జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు. ఈ బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ అధికంగా ఉంటుంది. ఇది తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేస్తుంది. దీంతో అజీర్ణం, గ్యాస్ తగ్గుతాయి. ఇక వేసవిలో పచ్చి బొప్పాయిలను తింటే శరీరం చల్లగా ఉంటుంది. ఎండ దెబ్బ నుంచి ఉపశమనం లభిస్తుంది.