మనం ఆహారంలో భాగంగా పల్లీలను కూడా తీసుకుంటూ ఉంటాము. పల్లీలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మనం పల్లీలను ఉడికించి, నేరుగా లేదా వేయించి తింటూ ఉంటాం. అలాగే వంటల్లో కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటాం. సరదాగా కాలక్షేపం కోసం తినే ఈ పల్లీల వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మనం ఆశ్చర్యపోవాల్సిందే.
పల్లీలను ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పల్లీలలో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల మాంసకృత్తులు, పీచు పదార్థాలు, పిండి పదార్థాల వంటి అనేక రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా మన ఆరోగ్యానికి మేలు చేసే 13 రకాల విటమిన్స్, 26 రకాల ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పల్లీలను వేయించి బెల్లంతో కలిపి తినడం వల్ల వికారం కలగకుండా ఉండడంతోపాటు రక్త వృద్ధి కూడా కలుగుతుంది.
తరచూ పల్లీలను తినడం వల్ల తగినంత శక్తి లభించి మనం చురుకుగా పని చేసుకోగలుగుతాం. అంతేకాకుండా మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. పిల్లలకు వీటిని తరచూ ఆహారంగా ఇవ్వడం వల్ల మెదడు చురుకుగా పని చేయడంతోపాటు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. వీటిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు కరిగి గుండె పనితీరు మెరుగుపడడంతోపాటు గుండె సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
వీటిలో అధికంగా ఉండే ఫైబర్ ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేయడంలో సహాయపడుతుంది. దీంతో పల్లీలను తినడం వల్ల అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే గుణం కూడా పల్లీలకు ఉంటుంది. వీటిని తరచూ తినడం వల్ల ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం. గర్భిణీ స్త్రీలు, బాలింతలు పల్లీలను తినడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచడంలో కూడా పల్లీలు మనకు ఉపయోగపడతాయి.
ఈ గింజల్లో మన శరీరానికి ఎంతో అవసరమయ్యే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. వీటిని తరచూ తినడం వల్ల మన జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. జుట్టు కుదుళ్లు కూడా బలంగా తయారవుతాయి. చర్మంపై వచ్చే ముడతలను తొలగించడంలో, చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో కూడా పల్లీలు మనకు దోహదపడతాయి. పచ్చి పల్లీలకు కొద్దిగా ఉప్పును కలిపి తినడం వల్ల చిగుళ్లు గట్టిపడతాయి. మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి కదా అని వీటిని ఎక్కువగా తీసుకోకూడదు.
పల్లీలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొందరిలో ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆస్తమా ఉన్న వారు పల్లీలను తక్కువ మోతాదులో తీసుకోవాలి. వేయించిన పల్లీలను తినడం కంటే ఉడకబెట్టిన పల్లీలను తినడం వల్ల మనం అధిక పోషకాలను పొందగలమని నిపుణులు చెబుతున్నారు. పల్లీలను ఏదో ఒక రూపంలో ఆహారంలో భాగంగా తీసుకోవాలని, వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.