మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఎంత అవసరమో ఆ ఆహారాన్ని తగిన సమయానికి తీసుకోవడం కూడా అంతే అవసరం. వేళ తప్పి భోజనం చేస్తే అది మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సరైన సమయాలకు భోజనం చేయాలి. ఇక రాత్రి పూట కొందరు ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక రాత్రి పూట ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా భోజనం చేసేయాలి. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
1. రాత్రి 7.30 గంటల లోపు భోజనం ముగించడం వల్ల అధిక బరువు తగ్గుతారు. మనం తిన్న ఆహారం నుంచి వచ్చే శక్తిని ఖర్చు పెట్టేందుకు శరీరానికి తగిన సమయం లభిస్తుంది. దీంతో క్యాలరీలు ఖర్చయి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
2. రాత్రి పూట త్వరగా భోజనం చేయడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. దీంతో స్థూలకాయం బారిన పడకుండా ఉంటారు.
3. రాత్రి పూట త్వరగా భోజనం చేసే వారికి క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని సైంటిస్టులు తమ పరిశోధనల్లో తేల్చారు. త్వరగా భోజనం ముగించే పురుషులకు 26 శాతం, మహిళలకు 16 శాతం వరకు క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
4. రాత్రి త్వరగా భోజనం చేసి త్వరగా నిద్రించడం వల్ల ఉదయాన్నే శక్తివంతంగా ఫీలవుతారు. కొందరికి ఉదయం నిద్రలేవగానే బద్దకంగా ఉంటుంది. ఏ పనీ చేయబుద్దికాదు. అలాంటి వారు ముందు రోజు త్వరగా భోజనం చేసి త్వరగా నిద్రిస్తే మరుసటి రోజు త్వరగా నిద్ర లేస్తారు. దీంతో ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేయగలుగుతారు.
5. రాత్రిపూట త్వరగా భోజనం చేయడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మనం తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసేందుకు కావల్సినంత సమయం లభిస్తుంది. అలాగే మరుసటి రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసే వరకు చాలా సమయం ఉంటుంది కనుక జీర్ణవ్యవస్థకు మరమ్మత్తులు చేసుకునేందుకు కావల్సినంత సమయం లభిస్తుంది. దీంతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
6. రాత్రి త్వరగా భోజనం చేయడం వల్ల నిద్ర చక్కగా పడుతుంది. భోజనానికి, నిద్రకు 3 గంటల వ్యవధి ఉంటే నిద్ర చక్కగా వస్తుంది. లేదంటే నిద్రలేమి సమస్య వస్తుంది. కనుక రాత్రి చక్కగా నిద్ర పట్టాలంటే త్వరగా భోజనం చేసేయాలి.
7. రాత్రి త్వరగా భోజనం చేసే వారికి గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్‌లు వచ్చేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. కనుక రాత్రి భోజనాన్ని త్వరగా ముగించాలి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365