ఆకుకూరలను చాలా మంది ఇష్టంగానే తింటారు. అయితే అందరూ అన్ని రకాల ఆకు కూరలను తినరు. కొన్ని ఆకు కూరలనే ఇష్టంగా తింటారు. కానీ నిజానికి అన్నింటినీ తినాల్సిందే. ముఖ్యంగా పాలకూరను అయితే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోవాలి. దీన్ని పోషకాల గనిగా చెబుతారు. ఇందులో మన శరీరానికి అవసరం అయ్యే విటమిన్లు, మినరల్స్, ఫైటో న్యూట్రియెంట్లు, ఐరన్, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. అందువల్ల పాలకూరను తరచూ తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు. దీని వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలకూరలో విటమిన్ ఎ, సిలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల దెబ్బ చర్మ కణాలు మరమ్మత్తు అవుతాయి. చర్మం సురక్షితంగా ఉంటుంది. చర్మ కణాలు పెరుగుతాయి. అలాగే చర్మం కాంతివంతంగా మారుతుంది. మచ్చలు తొలగిపోతాయి.
సూర్యుని నుంచి విడుదలయ్యే అతినీలలోహిత (అల్ట్రా వయొలెట్) కిరణాల బారిన పడితే చర్మ క్యాన్సర్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే పాలకూరలో ఉండే పోషకాలు ఆ కిరణాల నుంచి మనకు రక్షణను అందిస్తాయి. అందువల్ల చర్మ క్యాన్సర్ రాకుండా ఉంటుంది.
పాలకూరలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది హైబీపీని తగ్గిస్తుంది. అందువల్ల హైబీపీ సమస్య ఉన్నవారు తరచూ పాలకూరను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఫలితం ఉంటుంది. బీపీ తగ్గడంతోపాటు రక్త సరఫరా మెరుగు పడుతుంది.
పాలకూరలో విటమిన్ కె తోపాటు కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. దృఢంగా మారుతాయి. ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది. ఎముకలు గుల్లబారిపోకుండా ఉంటాయి. ఎముకలు విరిగే అవకాశాలు తగ్గుతాయి.
పాలకూరలో ఉండే ఫైబర్ అధిక బరువును తగ్గించడంలో సహాయ పడుతుంది. మలబద్దకం ఉండదు. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉంటారు. దీంతో అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.
పాలకూరలో లుటీన్, జియాంతిన్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కళ్లలో శుక్లాలు రాకుండా చూస్తాయి. వయస్సు మీద పడడం వల్ల వచ్చే కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. పాలకూరలో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. దృష్టి లోపాలు రావు. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
పాలకూరలో నియోజాంతిన్, వయోలాజాంతిన్ అనబడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఆస్టియోపోరోసిస్, మైగ్రేన్, ఆస్తమా, ఆర్థరైటిస్, తలనొప్పులు ఉన్నవారు పాలకూరను ఆహారంలో భాగం చేసుకుంటే ఆయా సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
నిత్యం మనం అనేక సందర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటుంటాం. అయితే పాలకూరను తరచూ తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. డిప్రెషన్ తగ్గుతుంది. పాలకూరలో ఉండే జింక్, మెగ్నిషియం చక్కని నిద్రను అందిస్తాయి. అందువల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. నిద్ర బాగా పడుతుంది.
పాలకూరలో ఉండే విటమిన్ కె నాడీ మండల వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అందువల్ల మెదడు చురుగ్గా మారుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
పాలకూరను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.
పాలకూరలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల దీన్ని తింటే రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. రక్తం బాగా తయారవుతుంది.
పాలకూరను తరచూ కూరగా చేసుకుని తినవచ్చు. లేదా నిత్యం అర గ్లాస్ మోతాదులో దీని జ్యూస్‌ను తీసుకోవచ్చు. అది కూడా కాకపోతే పాలకూరను నిత్యం సలాడ్స్ లో వేసి కూడా తినవచ్చు. ఎలా తీసుకున్నా ఆరోగ్యకరమైన ప్రయోజనాలే కలుగుతాయి.