నిత్యం కూర్చుని పనిచేసే వారిలో మూత్రపిండ సమస్యలు.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..

మారుతున్న కాలానికి అనుగుణంగా అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ప్రస్తుత తరుణంలో చాలా మంది కూర్చుని పనిచేసే ఉద్యోగాలు చేస్తున్నందున అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. గత 10-15 ఏళ్లుగా భారత్‌లో జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని సర్వేలు చెబుతున్నాయి. దేశంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మొత్తం మందిలో జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్న వారి శాతం 60గా ఉందని గణాంకాల్లో వెల్లడైంది. ముఖ్యంగా యువత ఈ వ్యాధుల బారిన పడుతున్నారని సైంటిస్టులు చెబుతున్నారు.

sedentary life style can create renal problems

మన దేశంలో ఏటా 2 లక్షల మందికి పైగా కిడ్నీ ఫెయిల్యూర్‌ వల్ల చనిపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటికే దేశంలో సుమారుగా 6 కోట్ల మందికి పైగా డయాబెటిస్‌ వ్యాధి గ్రస్తులు ఉన్నారు. ఇది ఏటా పెరుగుతోంది. ఇంకా అనేక మంది ప్రీ డయాబెటిస్‌ (డయాబెటిస్‌ వచ్చేందుకు ముందు దశ)తో బాధ పడుతున్నారు. వీరందరూ రాను రాను డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తుల జాబితాలో చేరుతారు. అయితే ఇవే కాకుండా హైబీపీ సమస్య కూడా ఇప్పుడు చాలా మందిలో పెరుగుతోంది. ఇవన్నీ మూత్ర పిండా వ్యాధులకు కారణమవుతున్నాయి.

30 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారిలో చాలా మంది జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్నారని, వీరిలో కిడ్నీ సంబంధ వ్యాధులు చాలా మందికి వస్తున్నాయని న్యూఢిల్లీలోని ఆస్టర్‌ సీఎంఐ హాస్పిటల్‌ నెఫ్రాలజీ లీడ్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ పి.విద్యాశంకర్‌ తెలిపారు. సదరు వయస్సు ఉన్నవారు ఎక్కువగా కూర్చుని పనిచేస్తున్నారని, శారీరక శ్రమ చేయడం లేదని, దీంతో జీవనశైలి వ్యాధుల బారిన పడి కిడ్నీ సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని వెల్లడించారు. కనుక ఎవరైనా సరే ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలని చెబుతున్నారు.

* జీవనశైలి వ్యాధులు, తద్వారా కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే నిత్యం అన్ని పోషకాలు కలిగిన పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.

* తరచూ రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్ష చేయించుకోవాలి.

* బీపీ నియంత్రణలో ఉండేలా చెక్‌ చేయిచుకోవాలి.

* ధూమపానం, మద్యపానం చేయరాదు.

* నిత్యం తగినంత మోతాదులో నీటిని తాగాలి.

*నొప్పులను తగ్గించుకునేందుకు పెయిన్‌ కిల్లర్స్‌ను ఎక్కువగా వాడరాదు. వాటికి బదులుగా సహజసిద్ధమైన పెయిన్‌ కిల్లర్స్‌ను వాడవచ్చు. పసుపు, లవంగాలు, యాలకులు, అల్లం వంటి పదార్థాలను వాడితే నొప్పులు, వాపులు తగ్గుతాయి.

* కిడ్నీలను ఎప్పటికప్పుడు పరీక్ష చేయించుకోవాలి.

* జంక్‌ ఫుడ్‌, నూనె పదార్థాలు తినరాదు.

* నిత్యం వ్యాయామం చేయాలి. కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్‌ చేసినా చాలు. ప్రయోజనం ఉంటుంది.

ఈ జాగ్రత్తలను పాటించడం వల్ల జీవనశైలి వ్యాధి అయిన డయాబెటిస్‌ వంటివి రాకుండా ఉంటాయి. దీంతో కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

Share
Admin

Recent Posts