Categories: Featured

ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజనాల‌ను అందించే.. 5 ఉత్త‌మ‌మైన మసాజ్ ఆయిల్స్‌..!

శ‌రీరానికి మ‌సాజ్ చేయ‌డం అనే ప్ర‌క్రియ ఎప్ప‌టి నుంచో ఉన్న‌దే. ఆయుర్వేదంలో ఎన్నో ఏళ్లుగా దీన్ని ఉప‌యోగిస్తున్నారు. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డానికి ఆయుర్వేదంలో కొన్ని క్రియ‌ల‌లో భాగంగా శ‌రీరానికి మ‌సాజ్ చేస్తారు. మ‌సాజ్ అనేది 200 ఏళ్ల నుంచి బాగా ప్రాచుర్యంలో ఉంది. ఇక శ‌రీరానికి నూనెతో మ‌సాజ్ చేయ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి. ఎముక‌లు దృఢంగా మారుతాయి. నిద్ర‌లేమి స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. శ‌రీరం చ‌క్క‌ని ఆకృతిని పొందుతుంది. నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ ప్ర‌శాంతంగా మారుతుంది. జీర్ణాశ‌య స‌మ‌స్య‌లు ఉండ‌వు. ఇలా ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

5 best massage oils for health benefits

అయితే శ‌రీరానికి మ‌సాజ్ చేయ‌డం ఎంత ముఖ్య‌మో మ‌సాజ్‌కు త‌గిన నూనెను ఎంపిక చేసుకోవ‌డం కూడా అంతే ముఖ్యం. ఒక్కో ర‌క‌మైన నూనెను మ‌సాజ్‌కు ఉప‌యోగించ‌డం వ‌ల్ల భిన్న‌ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో, మ‌సాజ్‌ల‌కు ఏయే నూనెల‌ను ఉప‌యోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఆలివ్ ఆయిల్

తేలిక‌పాటి మ‌సాజ్‌ల‌కు ఈ నూనెను ఉప‌యోగించ‌వ‌చ్చు. ఈ నూనెను శ‌రీరం నెమ్మ‌దిగా శోషించుకుంటుంది. ఈ క్ర‌మంలో కండ‌రాలు రిలాక్స్ అవుతాయి. శ‌రీరం తేమ‌ను పొందుతుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. నొప్పులు త‌గ్గుతాయి. కండ‌రాలు ప‌ట్టుకుంటే ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. వాపులు త‌గ్గుతాయి. త‌ర‌చూ ఈ నూనెతో మ‌సాజ్ చేసుకుంటే చ‌ర్మం సుర‌క్షితంగా ఉంటుంది.

2. నువ్వుల నూనె

శ‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఎముక‌లు దృఢంగా మారాలి. అందుకు నువ్వుల నూనె ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ నూనె వ‌ల్ల ఎముక‌లు దృఢంగా మారుతాయి. ఈ నూనెలో కాప‌ర్‌, మెగ్నిషియం, కాల్షియం, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, ప్రోటీన్లు స‌మృద్ధిగా ఉంటాయి. అందువ‌ల్ల ఎముక‌లు దృఢంగా మారుతాయి. మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుంది. చ‌ర్మం తేమ‌ను పొందుతుంది. ఈ నూనెలో ఉండే విట‌మిన్ ఇ శ‌రీరంపై స్ట్రెచ్ మార్క్‌ల‌ను, మ‌చ్చ‌ల‌ను తొల‌గిస్తుంది. వృద్ధాప్య ఛాయ‌లు రాకుండా ఉంటాయి. చ‌ర్మం ముడ‌త‌లు ప‌డ‌కుండా ఉంటుంది.

3. కొబ్బ‌రినూనె

కొబ్బ‌రినూనె కేవ‌లం వంట‌ల‌కే కాదు, మ‌సాజ్‌కు కూడా అద్భుతంగా ప‌నిచేస్తుంది. చ‌ర్మం తేమ‌గా మారుతుంది. కొబ్బ‌రినూనెలో స‌హ‌జ‌సిద్ధ‌మైన యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్‌, మాయిశ్చ‌రైజింగ్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల చ‌ర్మం శుభ్రంగా మారుతుంది. ఈ నూనెను మ‌సాజ్ కోసం వాడితే చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉండ‌వు.

4. బాదం నూనె

బాదం నూనెను స‌హ‌జంగానే చాలా మంది మ‌సాజ్ ల‌కు ఉప‌యోగిస్తుంటారు. మ‌సాజ్‌ల‌కు ఈ ఆయిల్ చాలా పాపుల‌ర్‌. ఈ నూనె ఇత‌ర నూనెల్లా అంత వాస‌న కూడా రాదు. అలాగే శ‌రీరం ఈ నూనెను త్వ‌ర‌గా శోషించుకుంటుంది. ఈ నూనెలో ఉండే విట‌మిన్ ఇ చ‌ర్మాన్ని సూర్య కిర‌ణాల బారి నుంచి ర‌క్షిస్తుంది. వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల చ‌ర్మంపై ముడ‌త‌లు రాకుండా ఉంటాయి. ఈ నూనెలో యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల పాదాల‌కు వ‌చ్చే ఇన్ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. తామ‌ర‌, గజ్జి, సోరియాసిస్ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

5. ఆవ నూనె

ఈ నూనె కొద్దిగా జిడ్డుగా అనిపిస్తుంది. కానీ దీన్ని కూడా చాలా మంది మ‌సాజ్‌ల‌కు ఉప‌యోగిస్తారు. ఈ నూనెతో శ‌రీరాన్ని త‌ర‌చూ మ‌సాజ్ చేయ‌డం వ‌ల్ల వాపులు, నొప్పులు తగ్గుతాయి. చ‌ర్మం పొడిబార‌కుండా ఉంటుంది. డ్రై స్కిన్ ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది. ఈ నూనెలో ఉండే స‌మ్మేళ‌నాలు క్యాన్స‌ర్ క‌ణాల‌ను పెర‌గ‌నీయ‌వు. సూక్ష్మ క్రిముల‌ను నాశ‌నం చేస్తాయి. చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. అయితే క‌ళ్ల ద‌గ్గ‌ర ఈ నూనెను అప్లై చేయ‌రాదు. చేస్తే దుర‌ద‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

శ‌రీరానికి నూనెతో మ‌సాజ్ ఎలా చేయాలి ?

శ‌రీరాన్ని మ‌సాజ్ చేసుకునేందుకు ఉద‌య‌మే స‌రైన స‌మ‌యం. స్నానం చేసేందుకు క‌నీసం 30 నిమిషాల ముందు మ‌సాజ్ చేసుకోవాలి. అంటే మ‌సాజ్ చేశాక అంత స‌మ‌యం పాటు ఆగాల్సి ఉంటుంద‌న్న‌మాట‌. అలాగే శ‌రీరాన్ని క‌నీసం 15 నిమిషాల పాటు సున్నితంగా, సుతారంగా మ‌ర్ద‌నా చేయాలి. బాగా ఒత్తిడి క‌లిగించ‌రాదు. మ‌సాజ్ ముగిశాక కొంత సేపు ఎండ‌లో ఉంటే మంచిది. ఇలా క‌నీసం ఒక నెల రోజుల పాటు రోజూ మ‌సాజ్ చేస్తే ఫ‌లితం త‌ప్ప‌క క‌నిపిస్తుంది. త‌రువాత కావాలంటే వారంలో 2, 3 సార్లు మ‌సాజ్ చేసుకోవ‌చ్చు.

Admin

Recent Posts