ఏదైనా స్వల్ప అనారోగ్యం కలిగినా చాలు, వెంటనే మందుల షాపుకు పరిగెత్తుకుని వెళ్లి బిళ్లలో, టానిక్కులో కొనడం, మింగడం మనకు పరిపాటే. వాటితో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయోనని కూడా ఆలోచించం. అప్పటికప్పుడు సమస్య తగ్గితే చాలనుకుంటాం. అయితే ఇప్పుడు చెప్పబోయేది మాత్రం మందులను మింగడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి కాదు లెండి. కానీ విషయం టాబ్లెట్లకు సంబంధించిందే. తెలుసుకోదగినది.
మందు బిళ్లలను కొన్నప్పుడు వాటిని మీరు ఎప్పుడైనా సరిగ్గా గమనించారా..? ఇంతకీ అందులో గమనించదగింది ఏముంది..? అని అడగబోతున్నారా..? అయితే ఉంది. నిజంగానే ఓసారి చూడండి. చూశారా..? అవును, మందు బిళ్లలన్నీ ప్యాక్‌లో ఒక్కో ఖాళీలో నింపబడి ఉన్నాయి. వాటి మధ్య కొంత ఖాళీ ప్రదేశం కూడా ఉంది. అంటారా..! అవునుండీ, అదే… దాని గురించే మేం చెప్పేది. అయితే మందుబిళ్లలన్నీ పక్క పక్కనే కాకుండా కొంత గ్యాప్ ఇచ్చి ఎందుకు ప్యాక్ చేశారో తెలుసా..? తెలీదు కదా..! కానీ… దానికీ కొన్ని కారణాలు ఉన్నాయి. అవేమిటంటే…
సాధారణంగా కొన్ని మందు బిళ్లలను సీసాల్లో ప్యాక్ చేస్తారు. వాటి సంగతి పక్కన పెడితే కొన్నింటిని మాత్రం బ్లిస్టర్ ప్యాక్‌లలో ఇస్తారు. కాగా బిళ్లలను ప్యాక్ చేసేటప్పుడు వాటిని పక్క పక్కనే కాకుండా కొంత గ్యాప్ ఇస్తూ ప్యాక్ చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే మందు బిళ్లల మధ్య కెమికల్ రియాక్షన్ ఏమీ జరగకూడదని. అవును, మీరు విన్నది కరెక్టే. పక్క పక్కనే ఉంటే ఆ బిళ్లను ఒకదానితో ఒకటి రసాయనికంగా చర్య జరిపి ఫలితంగా అవి మనకు పనికి రాకుండా పోతాయి. దీనికి తోడు బిళ్లలను రవాణా చేస్తున్నప్పుడు అవి పగలకుండా ఉండడం కోసం కూడా వాటిని ఆ విధంగా ప్యాక్ చేస్తారు.
అయితే కొన్ని సందర్భాల్లో పేషెంట్లు మొత్తం షీట్‌ను కొనుగోలు చేయరు. ఒకటి, రెండు టాబ్లెట్లు మాత్రమే కొంటారు. దీంతో ఆ సందర్భాల్లో బిళ్లలను సులభంగా కట్ చేయడం కోసం, వాటి వెనుక టాబ్లెట్ ప్రింట్ మ్యాటర్‌ను వినియోగదారునికి తెలియజేయడం కోసం కూడా అలా బిళ్లల మధ్యలో గ్యాప్‌లను పెడతారు. కాగా కొన్ని ప్యాక్‌లలో కేవలం ఒకే మందు బిళ్ల ఉంటుంది. అయినా దాని చుట్టూ కూడా కొన్ని చిన్న చిన్న ఖాళీలను పెడుతూ ప్యాకింగ్ చేస్తారు. ఇలా చేసేది కూడా పైన చెప్పిన కారణాల వల్లే. ఇప్పుడు తెలిసిందా, టాబ్లెట్ల మధ్య గ్యాప్ వదులుతూ ప్యాకింగ్ ఎందుకు చేస్తారో!