మనిషికి మాత్రమే జంతువులు శత్రువులు. సింహం, పులి, చిరుత, మొసలి, పాము, వగైరాలతో మనిషి మాత్రమే వైరం పెట్టుకుంటాడు. కానీ, ఆయా జంతువులు మనని శత్రువుగా కాదు కదా కనీసం జంతువుగా కూడా కన్పిడర్ చేయవు. ఎందుకంటే మనిషి మాంసం వాటికి రుచించదు కాబట్టి. సింహం గానీ, పులిగానీ మనిషిని తినాలని అనుకోవు. అసలు మనిషిని వేటాడానికి గానీ, తినడానికి గానీ ఇష్టపడవు. వాటి ఆహార సముపార్జన కోసం పరుగులు పెట్టినప్పుడు, దుప్పి వగైరాలను వేటాడినప్పుడు గానీ ఒక్కోసారి గాయాల పాలవుతాయి. అలా వేటాడలేని పరిస్థితి వచ్చినపుడు, వయసు మళ్లినపుడు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తేలికగా దొరికే మనిషిని తింటాయి. సింహం, పులి ఈ రెంటి విషయంలో ఇది కామన్.
అంటే – ఒక పులి మనిషిని తింటూ ఉంటే సాటి పులి దాని మీద జాలిపడుతూ..ఛీ ఎలాంటి దుస్థితి కలిగింది నీకు.. చివరికి.. ప్చ్.. మనిషిని తింటున్నావా.. అనక మానదు. నిజానికి, పులులను సింహాలను పెంపుడు జంతువులుగా మార్చుకున్నవారున్నారు. వారికి తెలుసు, అవి జస్ట్ బిగ్ క్యాట్స్ అని. వన్య ప్రాణులను పెంచుకోవడం కాసింత డేంజరస్. ఎప్పుడు ఏ మూడ్ లో ఉంటుందో చెప్పలేం. భీభత్సంగా పాంపరింగ్ చేస్తూ ఉండాలి లేదా సచ్చామే. పైగా, భరించలేనంత ఖర్చు. మెయింటైన్ చేయలేము. అర్ధం అయినట్టే ఉంటుంది, సచ్చినా అర్ధం కాదు.
ఇక మొసళ్ళలో రకాలున్నాయి. అత్యంత భారీగా ఉండే మొసలి తప్ప చిన్న సైజు మొసళ్ళలో మనిషి మాంసాన్ని జీర్ణించుకునే సామర్థ్యం ఉండదు. అనకొండ సినిమాలో చూపించినట్టు కొండచిలువలకు మనిషి ఆహారం కాదు. ఇక పాముల్లో బ్లాక్ మాంబా మినహాయిస్తే ఇక ఏ పామైనా ప్రాణభయంతోనే మనిషిని కాటు వేస్తుంది. బ్లాక్ మాంబా సంగతేంటి అంటే – అది రైటర్ కాదు, హంటర్. పోలార్ బేర్ మనిషిని చంపి తినేస్తుంది కానీ అది ఉన్న చోట మనిషి మనుగడ అంతగా ఉండదు. అసలు దానికి మనిషి అన్న స్పృహ ఏమీ ఉండదు. ఏది దొరికితే అది తింటుంది అంతే. కాబట్టి జంతువులు మనుషుల్ని తింటాయి అనేప్పుడు కాసిన్ని నిజాలు తెలుసుకోవాలి. మనిషి మాత్రమే ప్రతీ జంతువుని తింటాడు. కాబట్టి ప్రశ్న తిరగేసి అడగాలి. మనం జంతువులని తింటున్నప్పుడు, జంతువులు మాత్రం మనిషిని ఎందుకు తినకూడదు అని. అయితే ఆ ప్రశ్నకు జవాబు సదరు పులులు, సింహాలు (అంటే, గెడ్డం గీసుకోనివి) ఇవ్వాల్సి ఉంటుంది. మీరూ నేను దాని ప్రతినిధులుగా మాట్లాడలేం.