చికాకుగా, చిందర వందరగా మనస్సు ఉన్నప్పుడు వాటిని చూస్తే ఎంతో ఆహ్లాదం కలుగుతుంది. మనస్సుకు సాంత్వన చేకూరుతుంది. అవేనండీ పువ్వులు. రంగు రంగుల్లో ఉండే వాటిని చూస్తే ఎంతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. అంతే కాదు పలు రకాల పువ్వుల నుంచి వచ్చే సువాసనను చూస్తే మనం మరో లోకంలో విహరించినట్టు కూడా అనిపిస్తుంది. అయితే ఈ భూ ప్రపంచంపై ఉన్న దాదాపు ఏ పువ్వయినా ఏదో ఒక ఆకారంలో ఉంటుంది. కానీ కొన్ని అరుదైన పుష్ప జాతులు మాత్రం పలు రకాల విచిత్రమైన ఆకృతుల్లో ఉంటాయి. అవేమిటో, అవి ఎక్కడ పెరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బల్లెరినా ఆర్కిడ్ (Ballerina Orchid).. ఆస్ట్రేలియాలో ఈ పువ్వులు ఎక్కువగా లభిస్తాయి. క్రీమ్, మెరూన్ రంగుల్లో ఈ పూలు పూస్తాయి. అయితే అవి చూసేందుకు ఎలా ఉంటాయంటే అచ్చం బాలెట్ అమ్మాయి డ్యాన్స్ చేస్తున్నట్టు ఉంటాయి. బ్లీడింగ్ హార్ట్ (Bleeding Heart).. పేరుకు తగినట్టుగానే ఈ పువ్వులు హృదయం నుంచి రక్త స్రావం అవుతున్నట్టుగా ఉంటాయి. చూసేందుకు చక్కని పింక్ రంగులో ఆకర్షణీయంగా ఈ పూలు కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా కొరియా, జపాన్, చైనా, సైబీరియా దేశాల్లో మనకు కనిపిస్తాయి. డోవ్ ఆర్కిడ్ (Dove Orchid).. రెక్కలు విప్పుకున్న ఓ పావురం ఓ ఆధారంపై కూర్చున్నట్టుగా ఈ పూవు ఉంటుంది. చక్కని తెలుపు రంగులో ఈ పూలు పూస్తాయి. ఇవి దక్షిణ అమెరికా, ట్రినిడాడ్, పనామా, కోస్టారికా వంటి ప్రాంతాల్లో పూస్తాయి.
డక్ ఆర్కిడ్ (Duck Orchid).. బాతు ఆకారంలో ఉండే ఈ పూలు చూసేందుకు ఎంతగానో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియాలో కనిపిస్తాయి. హుకర్స్ లిప్స్ (Hooker’s Lips).. ఎరుపు రంగు లిప్‌స్టిక్ వేసుకున్న అమ్మాయి పెదవుల్లా ఈ పూలు పూస్తాయి. మంచి ఎరుపు రంగులో ఉండి బాగా ఆకట్టుకుంటాయి. ఇవి మధ్య, దక్షిణ ఆఫ్రికా ప్రాంతాల్లో ఉంటాయి. స్వాడిల్డ్ బేబీస్ (Swaddled Babies).. ఒక మృదువైన టవల్‌లో చుట్టబడి ఉన్న చిన్న పాపాయిని పోలి ఈ పూలు ఉంటాయి. ఇవి క్రీమ్ కలర్‌లో ఉంటాయి. ఈ పూల మొక్కలు కొలంబియా అడవుల్లో పెరుగుతాయి. స్నాప్‌డ్రాగన్ అండ్ ఇట్స్ స్కల్ (Snapdragon and its Skull).. దీన్ని డ్రాగన్ ఫ్లవర్ అని కూడా పిలుస్తారు. ఇవి చూసేందుకు అచ్చం మనిషి పుర్రెలానే ఉంటాయి. మొగ్గగా ఉన్నప్పుడు సాధారణ రూపంలోనే ఉండే ఈ పూలు పూర్తిగా విచ్చుకున్నాక ఆ రూపాన్ని పొందుతాయి. ఇవి ఎక్కువగా మెడిటరేనియన్ ప్రాంతాల్లో పూస్తాయి.
మంకీ ఆర్కిడ్ (Monkey Orchid).. ఈ పూలు చూసేందుకు అచ్చం బబూన్ కోతులను పోలి ఉంటాయి. ఇవి మెరూన్, క్రీం, తెలుపు రంగుల్లో పూస్తాయి. ఈక్వెడార్, పెరూ వంటి ప్రాంతాల్లో ఈ పూలు కనిపిస్తాయి. నేక్‌డ్ మ్యాన్ ఆర్కిడ్ (Naked Man Orchid).. ఈ పూలు నగ్నంగా ఉన్న మనిషి శరీరాన్ని పోలి ఉంటాయి. తెలుపు, పర్పుల్ రంగులను కలిపి పూలు ఉంటాయి. మెడిటరేనియన్ ప్రాంతంలో ఇవి కనిపిస్తాయి. ప్యారట్ ఫ్లవర్ (Parrot Flower).. బర్మా, థాయ్‌లాండ్, ఇండియాలలో పెరిగే ఈ మొక్కకు చెందిన పూలు చూసేందుకు అచ్చం చిలకలాగే ఉంటాయి. చూడ చక్కని రంగుల్లో దర్శనమిస్తాయి. లేడీస్ స్లిప్పర్ ఆర్కిడ్ (Lady’s Slipper Orchid).. ఈ పూలు మహిళలు ధరించే స్లిప్పర్, శాండిల్స్‌ను పోలి ఉంటాయి. గోధుమ రంగులో పూలు పూస్తాయి. యూకేలో ఇలాంటి పూలను మనం చూడవచ్చు.