మన దేశంలోనే కాదు నేడు ప్రపంచ దేశాలన్నింటిలోనూ పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన వనరుల సమస్య ఆయా దేశాలను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇక మన దేశంలో వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఏటా రోడ్ల మీదకు వస్తున్న వాహనాల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూనే ఉంది. దీంతో పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా ఇంధనం సరఫరా చేయడం కష్టంగా మారుతోంది. అందుకే వాటి ధరలు కూడా ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. అంతేకాదు, పెరుగుతున్న వాహనాల సంఖ్యతోనే కాలుష్యం కూడా తీవ్రతరమవుతోంది. ఢిల్లీలో కాలుష్య తీవ్రత తారా స్థాయికి చేరడంతో అక్కడ వాహనాలకు సరి, బేసి రూల్ పెట్టారు. అయితే ఇకపై కాలుష్య సమస్యే కాదు, మనకు పెట్రోల్, డీజిల్ కొనాల్సిన పనికూడా లేదు. అవును, మీరు విన్నది నిజమే. అలాంటి వాహనాలు త్వరలో రానున్నాయి.
మరి పెట్రోల్, డీజిల్ లేకపోతే వాహనాలు ఎలా నడుస్తాయి..? అనేగా మీ డౌట్. ఏమీ లేదండీ… అవి లేకపోయినా కరెంట్ ఉందిగా. అవును, అదే. దాంతోనే వాహనాలు నడుస్తాయి. విద్యుత్ తో నడిచే వాహనాలను 2030 వరకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనున్నారు. దీంతో ఆ సంవత్సరం వచ్చే సరికి పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాలను పూర్తిగా రోడ్లపైకి రాకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే కంపెనీలకు ప్రభుత్వం మరిన్ని రాయితీలు కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
నిజంగా అలా 2030 వరకు రూల్ రావాలే గానీ ఇక పెట్రోల్, డీజిల్ బంకులు అన్నీ మూత పడడం ఖాయం. వాటి స్థానంలో వాహనాలను చార్జింగ్ చేసే స్టేషన్లు వస్తాయి. అప్పుడు ఎంచక్కా వెహికిల్‌ను కొంత సేపు చార్జింగ్ పెట్టుకుని అందుకయ్యే చార్జీలు చెల్లించవచ్చు. ఎలాగూ అవి పెట్రోల్, డీజిల్ అంత రేటు ఉండవు లెండి. చాలా తక్కువగానే ఉంటాయి. కనుక వాటి గురించి ఇబ్బంది పడాల్సిన పనిలేదు. దీంతో పెద్ద ఎత్తున రవాణా ఖర్చులు తగ్గడమే కాదు, అన్ని వస్తువుల ధరలు తగ్గుతాయి. సాధారణ ప్రజలకు పెట్రోల్, డీజిల్ భారం ఉండదు. అవి లేకపోవడంతో కాలుష్యం కూడా తగ్గుతుంది. ఫలితంగా పర్యావరణం రక్షింపబడుతుంది. ఏది ఏమైనా ఈ ఐడియా చాలా బాగుంది కదా..! అది ఎంత త్వరగా అమలైతే అంత బెటర్..!