Off Beat

అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి చెందిన చైనా ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదగక పోవడానికి గల కారణాలు ఏమిటి ?

ఇది భాషా సమస్య కాదు. వాళ్ళ భాష తెలిసినవాళ్ళే ప్రపంచంలో దాదాపు 90 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు ఇంకో 90 కోట్ల మందికి మండ‌రిన్ భాష నేర్పడం అసాధ్యం కాదు. కావాలంటే ఒక్క ఏడాదిన్నర వ్యవధిలోనే మాట్లాడే మండ‌రిన్ నేర్పొచ్చు. ఒక దేశం ఆర్థికంగా సాంకేతికంగా అభివృద్ధి చెందడం వేరు. సూపర్ పవర్ కావడం వేరు. దీనికి వేరే కోణాలు చాలా ఉన్నాయని గమనించాలి. అమెరికా తన సంపదని అన్ని దేశాల వారితోనూ పంచుకుంటుంది. చైనా అలా పంచుకోదు. అమెరికా అందరినీ రానిస్తుంది. చైనా ఎవరినీ లోపలికి రానివ్వదు. అమెరికా అందరినీ బైటికి పోనిస్తుంది. చైనా ఎవరినీ పోనివ్వదు. అమెరికాకో ముద్రాంక విలువ (brand value) ఉంది. వాళ్ళని నమ్మి వాళ్ళ దగ్గర అందరూ డబ్బు దాచుకుంటారు. చైనాకి ఆ ముద్రాంక విలువ లేదు. అసలు విషయం ఏమంటే చైనా కూడా అమెరికా దగ్గరే డబ్బు దాఁచుకుంటుంది.

అమెరికాకి జాతి, మత, భాషా, సైద్ధాంతిక ఛాందసాలు లేవు. కానీ ఓ ముదుసలి, ముతక ఆసియా దేశంగా చైనాకి అవన్నీ ఉన్నాయి. ఎవడైతే నాకేంటి? అతను నాకు పనికొస్తాడా? పనికిరాఁడా? ఇదొక్కటే అమెరికా లెక్క. అమెరికా వివిధ దేశాలకి అవసరంలో ఆహార సరఫరా, మందుల సరఫరా, మిలిటరీ సహాయం, ఆయుధ సహకారం లాంటివి అందిస్తుంది. చైనా అలాంటిదేదీ చెయ్యదు. అమెరికాకి క్యూబా తప్ప చుట్టుపక్కల శత్రువులెవరూ లేరు. చైనాకి చుట్టుపక్కల ఉత్తర కొరియా, పాకిస్తాన్ తప్ప మిత్రులెవరూ లేరు. 12 దేశాలతో ఆగర్భ శత్రుత్వం. పరిసరాల్లో శత్రువులున్న దేశమేదీ ప్రపంచ స్థాయి సూపర్ పవర్ గా ఎదగఁజాలదు. వాళ్ళని ఎదుర్కోవడంలోనే దాని పుణ్యకాలమంతా గడిచిపోతుంది. మన ఇండియా సూపర్ పవర్ కాలేక పోవడానిక్కూడా ఇదో కారణం.

why china not became super power even if they have largest economy

Hard power తో పాటు అమెరికాకి విద్యారంగంలోనూ, శాస్త్ర పరిశోధనల్లోనూ, సినిమా రంగంలోనూ ప్రపంచ వ్యాప్తంగా soft power కూడా ఉంది. ఇంత తేడా ఉంది. సూపర్ పవర్ కావడమంటే మరేం లేదు. ఒక పెద్దన్న స్థానం. ఒక అంతర్జాతీయ భరోసా, ఒక తిరుగులేని పరపతి (influence). మాకు ఫలానా దేశం అన్ని విషయాల్లోనూ తోడు, నీడ. వాళ్ళు మా friends, guides and philosophers అని పలుదేశాలు భావన చెందే జీవిత బీమా భావన. ఏ క్షణంలో అయినా సరే, చిటికేసినంతలో పరకల (dozens) కొద్దీ దేశాలు తన వెంట తన అడుగుజాడల్లో నడవడానికి సిద్ధంగా, సర్వ సన్నద్ధంగా ఉండడం. ఇలా జ‌రగాలంటే మీరు అంతర్జాతీయంగా చాలా చాలా నమ్మకాన్ని సంపాదించుకుని ఉండాలి. చాలా దశాబ్దాల పాటు, తరతరాలుగా అన్ని కోణాల్లోనూ చెమటోడ్చి ఉండాలి.

ఇచ్చిపుచ్చుకునే తత్త్వం ద్వారానే ఆ హోదా, ఆ పరపతీ సిద్ధిస్తాయి. చైనా యొక్క ఇటీవలి చరిత్ర మొత్తం దొంగకోళ్ళూ, మ్రింగుడు ధోరణీ, రౌడీయిజ‌మే తప్ప ఇచ్చే తత్త్వం లేదు గనక – ఎన్నున్నప్పటికీ – అది ఏనాటికైనా అమెరికా లాంటి సూపర్ పవర్ కాఁగలగడం అనుమానాస్పదమే. వట్టి సంపద ఆ హోదాను సాధించిపెట్టదు.

Admin

Recent Posts