ట్రాఫిక్… ఈ మాట చెబితే చాలు… మన హైదరాబాదీలకు గుండెల్లో గుబులు పుడుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ జాం కలిగించే విసుగు అలాంటిది మరి. ప్రస్తుతం హైదరాబాద్ వంటి నగరాల్లోనే కాదు, చిన్న చిన్న పట్టణాల్లోనూ ట్రాఫిక్ జాం ఎక్కువగా ఏర్పడుతూనే ఉంది. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్పబోయేది మాత్రం ట్రాఫిక్ జాంల గురించి కాదు. ట్రాఫిక్ లైట్ల గురించి. అవును, వాటి గురించే. ఇంతకీ అందులో ఏముంది అంటారా? చూద్దాం రండి.
ప్రపంచంలోని ఏ దేశంలోనైనా, ఏ నగరంలోనైనా, ఎక్కడైనా ట్రాఫిక్ సిగ్నల్స్‌లో 3 రంగులు ఉంటాయి. అవి ఎరుపు, ఆకుపచ్చ, పసుపు పచ్చ. అయితే మిగతా కలర్ల సంగతి అటుంచితే అసలు ట్రాఫిక్ సిగ్నల్స్‌లో వాహనాలను ఆపేందుకు రెడ్ కలర్‌నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా..? తెలీదా..! అయితే ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. మీకు కలర్ చార్ట్ గుర్తుందా? అందులో ప్రాథమిక రంగులు 3 అని చదువుకున్నారు కదా. అవి రెడ్, గ్రీన్, బ్లూ. ఆ మూడింటినీ వివిధ రకాలుగా కలిపితే మిగతా రంగులన్నీ వస్తాయని చదువుకున్నారు కదా. అవును. అయితే ఆ 3 రంగుల్లో ఎరుపు రంగుకే తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎరుపు రంగు మాత్రమే ఎంత దూరంలో ఉన్నా చాలా క్లియర్‌గా, స్పష్టంగా కనిపిస్తుంది. మిగతా రంగులు అలా కనిపించవు. దీంతోనే ఎరుపు రంగును ట్రాఫిక్ సిగ్నల్స్‌లో వాహనాలను ఆపేందుకు వాడడం మొదలు పెట్టారు.
1865లో లండన్‌లో గుర్రపు బండ్ల కారణంగా ఎక్కువగా ప్రమాదాలు జరిగేవట. ఈ క్రమంలో వాటిని నివారించేందుకు అప్పట్లో జాన్ పీక్ అనే ఇంజినీర్ ఓ ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్‌ను రూపొందించి లండన్ మెట్రోపాలిటన్ అధికారులకు అందించాడట. దాన్ని వారు ఆమోదించగా అప్పటి నుంచి అదే పద్ధతిని ట్రాఫిక్ సిగ్నల్స్ కోసం వాడుతున్నారట. ఈ క్రమంలో అందులో వాహనాలను ఆపేందుకు ఎరుపు, వాహనాలను పోనిచ్చేందుకు ఆకుపచ్చ రంగులను వాడడం మొదలు పెట్టారు. అలా ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ప్రపంచమంతటికీ అందుబాటులోకి వచ్చింది. అయితే లండన్‌లో ఆ ఇంజినీర్ గ్యాస్ వంటి పదార్థాలను ఉపయోగించి ఎరుపు, ఆకుపచ్చ రంగులు వచ్చేలా చేశాడట. కానీ 1920లో డెట్రాయిట్‌లో విలియమ్ అనే వ్యక్తి ఇప్పుడు మనం వాడుతున్న 3 రంగుల ఎలక్ట్రికల్ తరహా ట్రాఫిక్ సిగ్నల్‌ను తయారు చేశాడట. దీంతో ఆ పద్ధతి అంతటా వాడుకలోకి వచ్చింది. ఎరుపంటే ప్రమాదాలను, రక్తాన్ని, అపాయాన్ని సూచిస్తుంది కాబట్టి పైన చెప్పిన ఇద్దరూ ఎరుపు రంగునే వాహనాల స్టాపింగ్ కోసం ట్రాఫిక్ సిగ్నల్‌గా ఉపయోగించారట. ఇప్పుడు తెలిసిందా? ట‌్రాఫిక్ సిగ్నల్స్‌లో ఎరుపు రంగు ఎలా అమలులోకి వచ్చిందో!