Akupatri : మనం వంటల్లో వాడే మసాలా దినుసుల్లో బిర్యానీ ఆకు కూడా ఒకటి. ఇది తెలియని వారుండరనే చెప్పవచ్చు. వెజ్, నాన్ వెజ్ మసాలా వంటకాల్లో దీనిని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. బిర్యానీ ఆకులు వేయడం వల్ల వంటల రుచి పెరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే బిర్యానీ ఆకును వంటల్లోనే కాకుండా ఔషధంగా కూడా ఉపయోగించవచ్చని మనలో చాలా మందికి తెలిసి ఉండదు. ఈ ఆకును ఉపయోగించడం వల్ల మనం వివిధ రకాల అనారోగ్య సమస్యలను మన దరి చేరకుండా చేసుకోవచ్చు. బిర్యానీ ఆకుల్లో ఉండే ఔషధ గుణాలను దానిని ఉపయోగించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బిర్యానీ ఆకును తెలుగులో ఆకుపత్రి, ముద్ద దాల్చిన చెట్టు ఆకు అని, సంస్కృతంలో తేజపత్ర, పాకరంజన అని, హిందీలో తేజ్ పత్తా అని పిలుస్తారు. ఈ ఆకు వగరు, తీపి రుచిని కలిగి ఉంటుంది. వాత, కఫ, పిత్త రోగాలను నయం చేయడంలో ఈ ఆకు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తరచూ నీరసంతో బాధపడే వారు ఆకుపత్రి పొడి 2 గ్రాములు, కండచక్కెర పొడి ఒక టీ స్పూన్, తేనె ఒక టీ స్పూన్ మోతాదులో కలిపి ఆహారానికి గంట ముందు రెండు పూటలా సేవిస్తూ ఉంటే నీరసం తగ్గుతుంది. అలాగే పొత్తి కడుపులో నొప్పితో బాధపడే వారు 2 గ్రాముల ఆకుపత్రి పొడిని రోజుకు రెండు పూటలా నోట్లో వేసుకుని చప్పరించి మింగాలి.
ఇలా చేయడం వల్ల పొత్తి కడుపులో నొప్పి తగ్గుతుంది. ఆకుపత్రిని ముక్కలుగా చేసుకుని దగ్గర ఉంచుకోవాలి. ఈ ఆకును ముక్కలను నోట్లో వేసుకుని చప్పరిస్తూ రసాన్ని మింగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల నత్తి, మాట్లాడేటప్పుడు గొంతు పట్టుకుపోవడం, దీర్ఘాలు తీసి మాట్లాడడం వంటి సమస్యలన్నీ తగ్గు ముఖం పడతాయి. అదే విధంగా బట్టలకు పురుగు పట్టకుండా నివారించడంలో కూడా ఆకుపత్రి మనకు ఉపయోగపడుతుంది. బట్టలు ఉంచే చోట ఆకుపత్రిని అక్కడక్కడా ఉంచాలి. ఇలా చేయడం వల్ల దాని ఘాటైన వాసన కారణంగా బట్టలకు పురుగు పట్టకుండా ఉంటుంది. స్త్రీలల్లో వచ్చే గర్భాశయ సమస్యలను నయం చేసే గుణం కూడా ఆకుపత్రికి ఉంది. ఆకుపత్రి ఆకులను 10 గ్రాముల మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి వేడి చేయాలి.
ఈ నీటిని ఒక కప్పు కషాయం అయ్యే వరకు మరిగించి వడకట్టుకోవాలి. ఇది గోరు వెచ్చగా అయిన తరువాత తాగుతూ ఉంటే గర్భాశయ సమస్యలు తొలగిపోయి నెలసరి సక్రమంగా వస్తుంది. ఆకుపత్రి, జఠామాంసి, మంచి గంధం, వట్టి వేర్లు, మరువం.. వీటన్నింటిని సమానంగా తీసుకుని నీటిలో వేసి నానబెట్టాలి. తరువాత వీటిని మెత్తగా రుబ్బగా వచ్చిన మిశ్రమాన్ని తలకు పట్టించాలి. ఈ మిశ్రమం ఆరిన తరువాత తలస్నానం చేస్తే శరీరం నుండి చక్కటి వాసన వస్తుంది. బిర్యానీ ఆకు ఇలా మనకు ఎంతో మేలు చేస్తుందని దీనిని వాడడం వల్ల మనం అనేక ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.