Atibala : మన చుట్టూ అనేక రకాల మొక్కలు ఉంటాయి. కానీ అవి మొండి రోగాలను సైతం నయం చేస్తాయని మనకు తెలియదు. ప్రకృతి ప్రసాదించిన ఈ మొక్కలను ఉపయోగించి ఔషధాలను తయారు చేస్తున్నారు. ఇలాంటి మొక్కలను మనం రోజూ చూస్తూనే ఉన్నాం. ఈ మొక్కల ఉపయోగాలు తెలియక వీటిని పిచ్చి మొక్కలుగా భావించి చాలా మంది వీటిని పీకేస్తుంటారు. ఇలాంటి మొక్కలలో అతిబల మొక్క ఒకటి. దీనినే దువ్వెన బెండ, ముద్ర బెండ, తుత్తురు బెండ అని ప్రాంతాల వారిగా పిలుస్తూ ఉంటారు. ఈ మొక్క చాలా మందికి తెలిసినప్పటికి దీనిలో ఉండే ఔషధ గుణాలు మాత్రం ఎవరికీ తెలియదు. గ్రామాలలో, చేను కంచెల వెంట ఈ మొక్కలు విరివిరిగా పెరుగుతాయి. పూర్వ కాలంలో ఈ చెట్టు కాయలతో ఎన్నో ఆటలు ఆడే వారు.
మన శరీరానికి అమితమైన బలాన్ని ఇవ్వడంలో ఈ మొక్క ఉపయోగపడుతుంది. కనుక దీనిని అతిబల అని పిలుస్తూ ఉంటారు. ఆయుర్వేదంలో అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఈ మొక్కను ఉపయోగిస్తున్నారు. మూత్ర నాళ సమస్యలను నివారించడంలో, మూత్ర పిండాలలో రాళ్లను కరిగించడంలో కూడా ఈ మొక్క ఉపయోగపడుతుంది. పిచ్చి కుక్క కరిచిన వారికి ఈ మొక్క ఆకుల రసాన్ని రెండు టీ స్పూన్స్ చొప్పున తాగించి, కుక్క కరిచిన చోట ఈ ఆకుల రసాన్ని పిండి, అవే ఆకులను ఉంచి కట్టు కట్టడం వల్ల విష ప్రభావం తగ్గుతుంది.
కీళ్ల నొప్పులు, కీళ్ల వాతాన్ని తగ్గించడంలో కూడా ఈ మొక్క ఆకులు ఉపయోగపడతాయి. ఈ చెట్టు ఆకులను పేస్ట్ గా చేసి ఆవనూనె కలిపి రాయడం వల్ల కీళ్ల నొప్పి, కీళ్ల వాతం తగ్గుతాయి. ఈ చెట్టు ఆకులను ఉడికించి తింటే రక్త మొలలు తగ్గుతాయి. శరీరంలో వాపులు ఉన్న చోట అతిబల చెట్టు ఆకులను ఉడికించి కట్టుగా కట్టడం వల్ల వాపులు తగ్గుతాయి. స్త్రీలల్లో వచ్చే యోని ఇన్ ఫెక్షన్లను తగ్గించడంలో కూడా అతిబల మొక్క సహాయపడుతుంది. అతిబల ఆకులతో కషాయాన్ని చేసి చల్లారిన తరువాత యోనిని శుభ్రం చేసుకోవడం వల్ల ఇన్ ఫెక్షన్లు తగ్గుతాయి.
ఈ మొక్క ఆకులకు పసుపును కలిపి మెత్తగా నూరి గాయాలపై, పుండ్లపై రాయడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. మూత్రంలో మంట, మూత్ర పిండాలలో రాళ్లు ఉన్న వారు ఈ మొక్కకు చెందిన నాలుగు ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి పావు లీటర్ నీళ్లలో వేసి సగం అయ్యే వరకు మరిగించి చల్లారిన తరువాత వడకట్టి ఈ నీటికి కొద్దిగా తేనెను కలిపి ఈ మొత్తాన్ని మూడు పూటలా తీసుకోవడం వల్ల మూత్రంలో మంట, మూత్ర పిండాలలో రాళ్ల సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
అతిబల మొక్క గింజలను పొడిగా చేసి టీ, కాఫీ తయారీలో కూడా వాడవచ్చు. ఈ మొక్క ఆకులను పొడిగా చేసి ఈ పొడితో డికాషన్ చేసి చల్లారిన తరువాత కళ్లను మూసి కళ్లు కడుక్కోవడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. ఈ మొక్క ఆకులు, పువ్వులు, కాయలు, వేర్లను నీటిలో వేసి మరిగించి, వడకట్టుకుని తాగడం వల్ల క్షయ వ్యాధితోపాటు శ్వాసకోశ సంబంధమైన సమస్యలన్నీ తగ్గుతాయి.
అతిబల ఆకులను 5 నుండి 6 గంటల పాటు నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల జ్వరం తగ్గుతుంది. దంతాల సమస్యలు ఉన్నవారు ఈ ఆకుల రసాన్ని నోట్లో వేసుకుని పుక్కిలించడం వల్ల దంతాల సమస్యలు తగ్గుతాయి. ఈ ఆకులతో చేసిన కషాయాన్ని తాగడం వల్ల నడుము నొప్పి తగ్గుతుంది. ఆవు పాలను ఈ మొక్క వేరుతో కలుపుతూ మరిగించి పాలు మరిగిన తరువాత పట్టిక బెల్లాన్ని కలిపి తాగడం వల్ల మన శరీరానికి అమితమైన బలం చేకూరుతుంది. మనకు వచ్చే 100 రకాల అనారోగ్య సమస్యలను అతిబల మొక్కను ఉపయోగించి నయం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.