Gobi Manchurian : సాయంత్రం సమయాల్లో తినడానికి బయట మనకు అనేక రకాల చిరు తిళ్లు లభిస్తూ ఉంటాయి.ఈ విధంగా లభించే వాటిల్లో గోబీ మంచూరియా ఒకటి. ఇది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లలో ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. గోబీ మంచూరియా రుచి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో రుచిగా ఉండే గోబీ మంచూరియాను మనం ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో దొరికే విధంగా దీనిని మనం తయారు చేసుకోవచ్చు. చాలా సులువుగా గోబీ మంచూరియాను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోబీ మంచూరియా తయారీకి కావల్సిన పదార్థాలు..
కాలీఫ్లవర్ – అర కిలో, కార్న్ ఫ్లోర్ – 4 టేబుల్ స్పూన్స్, మైదా పిండి – 2 టేబుల్ స్పూన్స్, కారం – పావు టీ స్పూన్, చిన్నగా తరిగిన అల్లం – కొద్దిగా, చిన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు – 5, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – ఒకటి, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 3, సోయా సాస్ – 2 టీ స్పూన్స్, రెడ్ చిల్లీ సాస్ – 1 టీ స్పూన్, టమాటా కెచప్ – ఒక టేబుల్ స్పూన్, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లి కాడలు – పావు కప్పు, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్పు – రుచికి తగినంత, నీళ్లు – తగినన్ని.
గోబీ మంచూరియా తయారీ విధానం..
ముందుగా కాలీఫలవర్ ను కాడలు లేకుండా కేవలం పువ్వును మాత్రమే మధ్యస్థంగా ఉండేలా ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నీళ్లను పోసి కొద్దిగా ఉప్పును వేసి వేడి చేసిన తరువాత తరిగిన కాలీఫ్లవర్ ముక్కలును వేసి 3 నిమిషాల పాటు ఉడికించి నీళ్లను పారబోయాలి. తరువాత ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్, మైదా పిండి, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లను పోసి ఉండలు లేకుండా మరీ పలుచగా కాకుండా కొద్దిగా గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. ఇందులో ముందుగా ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలను వేసి ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి నూనె కాగిన తరువాత కాలీఫ్లవర్ ముక్కలను వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
ఇప్పుడు కళాయిలో 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసి నూనె వేడయ్యాక తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలను వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, టమాట కెచప్ వేసి కలుపుకోవాలి. ఇందులోనే నీళ్లతోపాటు ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ ను వేసి కొద్దిగా నీళ్లను పోసి ఉండలు లేకుండా కలిపి వేసుకోవాలి. ఈ మిశ్రమం దగ్గరపడిన తరువాత ముందుగా వేయించిన కాలీఫ్లవర్ ముక్కలను, తరిగిన ఉల్లికాడలను వేసి 3 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బయట దొరికే విధంగా ఉండే గోబీ మంచూరియా తయారవుతుంది. దీనిలో ఫుడ్ కలర్ ను, టేస్టింగ్ సాల్ట్ ను కూడా వేసుకోవచ్చు. కాలీఫ్లవర్ తో అప్పుడప్పుడూ ఇలా మంచూరియా చేసుకుని సాయంత్రం సమయాలలో తినవచ్చు.