Virigi Chettu : పూర్వ కాలంలో గ్రామాలలో వివిధ రకాల పండ్ల చెట్లు ఉండేవి. ఇలాంటి పండ్ల చెట్లల్లో విరిగి చెట్టు ఒకటి. దీనిని నక్కెర, నెక్కెర, బంక నక్కెర, బంక కాయల చెట్టు వంటి వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ చెట్టు కాయలను, పండ్లను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. పచ్చి కాయల కంటే పండిన కాయలు ఇంకా రుచిగా ఉంటాయి. వీటి పండ్లను తిన్నప్పుడు బంకగా, తియ్యగా ఉంటాయి. కనుక వీటిని బంక కాయలు అని పిలుస్తూ ఉంటారు. భారతదేశంతోపాటు ఇతర దేశాలలోనూ ఈ చెట్లు ఉండడాన్ని మనం చూడవచ్చు. దీనిని ఇంగ్లీష్ లో లాసోరా, గమ్ బెర్రి, ఇండియన్ చెర్రీ అని అంటారు.
ఆయుర్వేదంలో ఈ చెట్టును ఔషధంగా ఉపయోగించి అనారోగ్య సమస్యలను తగ్గిస్తున్నారు. ఈ చెట్టు ఆకులు, పండ్లు, విత్తనాలు, బెరడు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. విరిగి చెట్టు కాయలను పచ్చడిగా కూడా చేసుకుని తింటూ ఉంటారు. మనకు విరిగి చెట్టు కాయలు డ్రై ఫ్రూట్స్ రూపంలో కూడా దొరుకుతాయి. ఈ చెట్టు పండ్లల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా కాల్షియం, జింక్, ఫాస్పరస్, ఐరన్, కాపర్ వంటి ఖనిజాలతోపాటు ప్రోటీన్స్ కూడా అధికంగా ఉంటాయి.
విరిగి పండ్లను తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలను పొందవచ్చు. ఈ పండ్లను తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. లైంగిక సమస్యలను తగ్గించి లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలోనూ విరిగి పండ్లు ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల మగవారిలో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. జీర్ణ శక్తి తక్కువగా ఉన్నవారు రోజుకు 5 చొప్పున ఈ పండ్లను తినడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. అనేక ఉపయోగాలు ఉన్నప్పటికి ఈ పండ్లను తక్కువ మొత్తంలోనే ఆహారంగా తీసుకోవాలి. రోజుకి 10 పండ్ల కంటే ఎక్కువగా వీటిని తినరాదు.
చర్మ సంబంధమైన సమస్యలను తగ్గించడంలో విరిగి చెట్టు బెరడు ఉపయోగపడుతుంది. ఈ చెట్టు బెరుడుతో కషాయన్ని చేసి 50 ఎంఎల్ నుండి 100 ఎంఎల్ వరకు వయస్సును బట్టి తీసుకోవడం వల్ల జ్వరం తగ్గుతుంది. పూర్వకాలంలో విరిగి చెట్టు బెరడును పొడిలా చేసి దంతాలను శుభ్రం చేసుకునే వారు. ఈ చెట్టు బెరడుతో చేసిన కషాయాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల దంతాలు, చిగుళ్లు గట్టిపడతాయి. నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. నోటి పూత కూడా తగ్గుతుంది. ఈ కషాయంతో గాయాలను శుభ్రం చేయడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. తలనొప్పిని తగ్గించడంలోనూ విరిగి చెట్టు ఉపయోగపడుతుంది. ఈ చెట్టు లేత ఆకులను మెత్తగా చేసి నుదుటిపై ఉంచుకోవడం వల్ల తలనొప్పి వెంంటనే తగ్గుతుంది. వీటి ఆకుల కషాయాన్ని తాగడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. కనుక ఈ చెట్టు ఎక్కడ కనిపించినా విడిచిపెట్టవద్దు. దీంతో అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.