Fenugreek Leaves : మనకు దాదాపుగా అన్ని సీజన్లలోనూ అనేక రకాల ఆకుకూరలు అందుబాటులో ఉంటాయి. ఎవరి అభిరుచులను బట్టి వారు ఆకుకూరలను కొని వండుకుని తింటుంటారు. అయితే మనం తినే ఆకుకూరల్లో మెంతి కూర కూడా ఒకటి. ఇది కాస్త చేదుగా ఉంటుంది. అందువల్ల దీన్ని సాధారణంగా చాలా మంది తినరు. కానీ దీన్ని వంటల్లో మాత్రం వేస్తుంటారు. కొత్తిమీర లేదా కరివేపాకులా కాస్త తక్కువ మోతాదులో మెంతి ఆకులను వంటల్లో వేస్తుంటారు. దీంతో వంటలకు చక్కని రుచి వస్తుంది. అయితే మెంతి ఆకులను చలికాలంలో మాత్రం తప్పక తినాలని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల అనేక లాభాలను పొందవచ్చని వారు అంటున్నారు. ఇక మెంతి ఆకులను ఈ సీజన్‌లో తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతి ఆకుల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ కె అధికంగా ఉంటుంది. ఇది గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేందుకు సహాయ పడుతుంది. అలాగే మెంతి ఆకుల్లో కాల్షియం, విటమిన్ సి, ఎ, బి కాంప్లెక్స్ వంటి విటమిన్లు అధికంగా ఉంటాయి. అందువల్ల మెంతి ఆకులను తినడం వల్ల మనకు పోషణ లభిస్తుంది. పోషకాహార లోపం నుంచి బయట పడవచ్చు. ఇక చలికాలంలో మన జీర్ణవ్యవస్థ పనితీరు సహజంగానే మందగిస్తుంది. దీంతో పలు రకాల జీర్ణ సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అలాగే మలబద్దకం కూడా వస్తుంది. అయితే మెంతి ఆకులను చలికాలంలో తినడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మలబద్దకం అన్న మాటే ఉండదు. రోజూ ఉదయాన్నే సుఖ విరేచనం అవుతుంది. కనుక మెంతి ఆకులను తప్పక తినాలి.
ఈ ఆకులను నేరుగా తినలేని వారు రోజూ ఉదయాన్నే జ్యూస్ చేసి 30 ఎంఎల్ మోతాదులో పరగడుపునే తాగవచ్చు. దీనివల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. మెంతి ఆకులను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. కనుక మెంతి ఆకులను చలికాలంలో తప్పక తినాలని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. పోషణ కూడా లభిస్తుంది.