Lotta Peesu Chettu : లొట్ట పీసు చెట్టు.. దీనినే పిస చెట్టు, తుత్తు కాడ చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ చెట్టు మనకు ఎక్కువగా గ్రామాల్లో, రోడ్లకు ఇరువైపులా, చెరువుల దగ్గర, కంపల్లో పెరుగుతుంది. ఈ మొక్క ఎక్కడైనా చాలా సులభంగా పెరుగుతుంది. ఈ చెట్టు పూలు చూడడానికి చాలా చక్కగా ఉంటాయి. అలాగే ఈ చెట్టు ఆకులను, కాండాన్ని తుంచినప్పుడు వాటి నుండి పాలు రావడం జరుగుతుంది. అసలు చాలా మంది ఈ మొక్కను తాకడానికే భయపడుతూ ఉంటారు. ఈ చెట్టు ఆకులను, పూలను తింటే పిచ్చి వాళ్లు అవుతారని నమ్ముతూ ఉంటారు. పశువులు కూడా ఈ మొక్క జోలికి రావు. ఈ చెట్టును మనలో చాలా మంది చూసే ఉంటారు.
కానీ దీని వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందని మనలో చాలా మందికి తెలియదు. లొట్ట పీసు చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. దీనిని ఉపయోగించడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. లొట్టపీసు చెట్టు వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చెట్టు యొక్క శాస్త్రీయ నామం ఐపోమియో కార్నియా. దీనిని హిందీలో బేషరమ్, ఇంగ్లీష్ లో బుష్ మార్నింగ్ గ్లోరీ అని పిలుస్తారు. ఈ చెట్టు ఆకులను ఉపయోగించడం వల్ల మనం పాదాల వాపులను తగ్గించుకోవచ్చు. ఈ ఆకులను మెత్తగా నూరి దానికి ఆవనూనె కలిపి వేడి చేయాలి. ఇలా తయారు చేసుకున్న పేస్ట్ ను పాదాల వాపులపై రాసి నెమ్మదిగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాల వాపులు తగ్గుతాయి.
అలాగే ఈ చెట్టు ఆకులను తుంచగా వచ్చిన పాలను తేలు కాటుకు గురి అయిన చోట రాయాలి. ఇలా రాయడం వల్ల తేలు కాటు విషం హరిస్తుంది. అలాగే ఈ పాలను లేపనంగా రాయడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కలిగే తామర వంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి. అదే విధంగా వయసుపై బడే కొద్ది అనేక రకాల నొప్పులు వస్తూ ఉంటాయి. నొప్పులతో బాధపడతున్నప్పుడు ఈ ఆకుల పేస్ట్ ను రాసి కట్టుకట్టాలి. ఇలా చేయడం వల్ల నొప్పులు తగ్గుతాయి. ఈ విధంగా లొట్టపీసు చెట్టు మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుందని అయితే దీనిని ఉపయోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించాలని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.