Thotakura : తోటకూర.. ఇది మనందరికీ తెలుసు. తోటకూరను మనం వేపుడుగా , కూరగా, పప్పుగా చేసుకుని తింటాం. ఏ విధంగా చేసినా కూడా తోటకూరను తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ తోటకూరను తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తోటకూరను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని, దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు చెబుతున్నారు. తోటకూరను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తోటకూరను సంస్కృతంలో మారిష, బాష్పక అని పిలుస్తారు. తోటకూరలో పెరుగు తోటకూర, ఎర్ర తోటకూర, కొయ్య తోటకూర, చిలుక తోటకూర వంటి రకాలు ఉంటాయి.
తోటకూరే కదా అని చాలా మంది దీనిని తేలికగా తీసుకుంటూ ఉంటారు. తోటకూరలో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ కె లతోపాటు ఐరన్, కాల్షియం, సోడియం, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నిషియం, జింక్, కాపర్ వంటి మినరల్స్ కూడా ఉంటాయి. తోటకూరలో గర్భిణీలకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. దాదాపుగా మాంసంతో సరిసమానమైన ప్రోటీన్స్ తోటకూరలో ఉంటాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. బరువు తగ్గడంలో తోటకూర మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తరచూ తోటకూరను తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు శాతం తగ్గుతుంది. దీంతో మనం సలువుగా బరువు తగ్గవచ్చు. తోటకూరలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.
జీర్ణాశయ సంబంధిత సమస్యలైన అజీర్తి, మలబద్దకం వంటి వాటితో బాధపడే వారు తోటకూరను తినడం వల్ల ఆయా సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడే వారు తోటకూరను తినడం వల్ల ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. తోటకూరను తినడం వల్ల పలు రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. తోటకూరలో అధికంగా ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తోటకూర నియంత్రణలో ఉంచుతుంది. తోటకూరును తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి రోగాల బారిన పడకుండా ఉంటాం.
తోటకూరలో ఉండే సోడియం, పొటాషియం వంటి మినరల్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడతాయి. గర్భిణీలు తోటకూరను కూరగా లేదా జ్యూస్ గా చేసుకుని తీసుకోవడం వల్ల తగినంత ఫోలిక్ యాసిడ్ లభించి గర్భస్థ శిశువు ఆరోగ్యం మెరుగుపడుతుంది. తోటకూరను మెత్తగా నూరి తలకు పట్టించడం వల్ల జుట్టు రాలడం సమస్యతోపాటు చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. తోటకూరను వేపుడుగా కంటే కూడా కూరగా చేసుకుని తినడం వల్లే మనకు ఎక్కువ పోషకాలు అందుతాయి. కనుక వారానికి రెండు నుండి మూడు సార్లు తప్పకుండా తోటకూరను ఆహారంలో భాగంగా తీసుకోవాలని, దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.