Nalla Ummetta : మనకు ఉమ్మెత్త మొక్క గురించి తెలుసు. ఈ మొక్క ఔషధ గుణాలను కలిగి ఉంటుందని, మనకు వచ్చే అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఎంతో ఉపయోగపడుతుందని కూడా మనకు తెలుసు. అయితే మనలో చాలా మందికి ఉమ్మెత్తలో రెండు రకాలు ఉంటాయని తెలియదు. ఉమ్మెత్తలో తెల్ల ఉమ్మెత్త, నల్ల ఉమ్మెత్త అని రెండు రకాలు ఉంటాయి. తెల్ల ఉమ్మెత్త గురించి మనకు తెలుసు. ఇది ఎక్కడబడితే అక్కడకనబడుతూనే ఉంటుంది. కానీ నల్ల ఉమ్మెత్త చాలా తక్కువగా కనిపిస్తుంది. నల్ల ఉమ్మెత్త కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా నల్ల ఉమ్మెత్తను ధన వృద్ధికి, నర దిష్టికి కూడా ఉపయోగిస్తారు. నల్ల ఉమ్మెత్తను ధన వృద్ధికి ఎలా ఉపయోగించాలి.. దీనిలో ఉండే ఔషధ గుణాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్వకాలంలో నల్ల ఉమ్మెత్తను ఇంటి ముందు పెంచుకునే వారు. దీనిని ఇంటి ముందు పెంచుకోవడం వల్ల నరదిష్టి, నరఘోష తగలకుండా ఉంటాయని నమ్మేవారు. నరుడి చూపుకు నల్లరాయి కూడా పగులుతుంది అనే నానుడి మనకు ఉండనే ఉంది. కనుక నరదిష్టి, నరఘోష తగిలితే ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో నిలవదు. అభివృద్ధి చెందాల్సిన వారు కూడా పతనమైపోతారు. చాలా మంది ఇంటికి, ఇంట్లోని వారికి నరదిష్టి తగలకుండా ఇంటి ముందు నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుకుంటూ ఉంటారు. కొందరు వ్యాపార సంస్థల ముందు కూడా నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుకుంటూ ఉంటారు. ఈ మొక్క వేరును ఇంట్లో, వ్యాపార సంస్థలలో ధనం దాచుకునే చోట ఉంచడం వల్ల వ్యాపారం లభాల బాట పట్టేలా చేసి ధనాన్ని ఆకర్షిస్తుంది. దీని వేరును తాయెత్తులా మెడలో ధరిస్తే నర దిష్టి తగలకుండా ఉంటుంది.
నల్ల ఉమ్మెత్తను ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఈ మొక్క ఆకుల రసాన్ని అరికాళ్లకు రాసుకోవడం వల్ల అరికాళ్ల మంటలు తగ్గుతాయి. ఈ ఆకుల రసాన్ని రాయడం వల్ల పేను కొరుకుడు సమస్య తగ్గి ఆ ప్రదేశంలో కొత్త వెంట్రుకలు వస్తాయి. సెగ గడ్డలు, వ్రణాలు, స్త్రీలలో స్థనాలు వాపులకు గురైనప్పుడు ఈ నల్ల ఉమ్మెత్త ఆకులను సేకరించి వాటికి ఆముదాన్ని రాసి వేడి చేసి గోరు వెచ్చగా ఉన్నప్పుడే గడ్డలు, వ్రణాలపై, స్త్రీలు స్థనాలపై ఉంచి కట్టుగా కట్టడం వల్ల సమస్యలు తగ్గుతాయి. ఇలా వేడి చేసిన ఆకులను శరీరంలో నొప్పులు ఉన్న చోట కూడా ఉంచి కట్టుగా కట్టడం వల్ల నొప్పులు తగ్గుతాయి. ఈ మొక్క ఆకులకు నువ్వుల నూనెను రాసి వేడి చేసి తలపై ఉంచుకుంటే తలనొప్పి తగ్గుతుంది. ఇలా తయారు చేసిన ఆకులను పొట్టపై ఉంచుకుంటే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగి అధిక పొట్ట సమస్య తగ్గుతుంది.
మోకాళ్ల నొప్పులతో బాధ పడే వారు ఈ మొక్క ఆకులను మెత్తగా దంచి వాటిని మోకాళ్ల పై ఉంచి కట్టుగా కట్టడంవల్ల నొప్పులు తగ్గుతాయి. నల్ల ఉమ్మెత్త గింజలను సేకరించి వాటిని పేస్ట్ లా చేసి రాయడం వల్ల కాళ్ల పగుళ్లు తగ్గుతాయి. ఈ మొక్క ఆకుల పేస్ట్ ను పై పూతగా రాయడం వల్ల తామర, గజ్జి వంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి. నల్ల ఉమ్మెత్తను కేవలం శరీరం పై పూతగా మాత్రమే ఉపయోగించాలి. దీనిని శరీరం లోపలికి తీసుకోకూడదు. ఈ విధంగా నల్ల ఉమ్మెత్త చెట్టును ఇంటి ముందు పెంచుకోవడం వల్ల ధనప్రాప్తి కలగడమే కాకుండా ఔషధంగా కూడా పనికి వస్తుంది.