Tella Jilledu : ఆయుర్వేదంలో ఎంతో విశిష్టత కలిగిన మొక్కల్లో జిల్లేడు మొక్క కూడా ఒకటి. ఈ మొక్క విశిష్టతను గుర్తించిన మన పూర్వీకులు దీనిని ఆయుర్వేదంతోపాటు దైవ కార్యాల్లో కూడా విరివిరిగా వాడుతున్నారు. జిల్లేడు మొక్కలలో తెలుపు రంగు పూలు పూసే జిల్లేడు, వంగపండు పూలు పూసే జిల్లేడు ఇలా రెండు రకాలు ఉంటాయి. మనకు తెల్ల జిల్లేడు మొక్క ఎక్కువగా కనిపించదు. దీనినే శ్వేతార్కం అని కూడా అంటారు. ఈ మొక్కలో ప్రతి భాగం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. జిల్లేడు మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నడుము నొప్పితోపాటు వాపులతో బాధపడే వారు తెల్ల జిల్లేడు ఆకులకు ఆవ నూనెను రాసి వేడి చేయాలి. ఈ ఆకులను నొప్పి, వాపు ఉన్న చోట ఉంచి కట్టుకట్టడం వల్ల ఆయా సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ మొక్కను తుంచినప్పుడు పాలు కారుతాయని మనందరికీ తెలుసు. ఈ పాలు విషపూరితం. కనుక ఈ ఆకులను సేకరించేటప్పుడు తగు జాగ్రత్తలను తీసుకోవాలి. జిల్లేడు వేరును కాల్చి ఈ వేరుతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంత సమస్యలు దూరమవుతాయి. జిల్లేడు మొక్క ఆకులకు ఆముదాన్ని కానీ నువ్వుల నూనె కానీ రాసి వాటికి కొద్దిగా ఉప్పును కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమం నుండి రసాన్ని వేరు చేసి ఈ రసాన్ని రెండు మూడు చుక్కల చొప్పున చెవిలో వేసుకోవడం వల్ల చెవిపోటు తగ్గుతుంది.
పాము లేదా తేలు వంటి విష కీటకాలు కుట్టినప్పుడు ప్రథమ చికిత్సగా జిల్లేడు ఆకులను వాడవచ్చు. జిల్లేడు ఆకులను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని పాము లేదా తేలు కుట్టిన చోట ఉంచి కట్టుకట్టడం వల్ల కొంతమేర విష ప్రభావం తగ్గుతుంది. గాయాలు తగిలినప్పుడు జిల్లేడు పాలను గాయాలపై రాయడం వల్ల రక్తస్రావం తగ్గుతుంది. చాలా మంది జిల్లేడు మొక్కను ఇంట్లో పెంచుకోకూడదు అని అంటుంటారు. కేవలం ఇది మూఢనమ్మకం మాత్రమేనని పండితులు చెబుతున్నారు. జిల్లేడు మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల సిరి సంపదలు కలుగుతాయని వారు చెబుతున్నారు. జిల్లేడు మొక్క వేర్లకు దుష్ట శక్తులను ప్రాలదోలే శక్తి కూడా ఉంటుంది. రథ సప్తమి రోజున జిల్లేడు ఆకులను తలపై ఉంచి తలస్నానం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా జిల్లేడు మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.