Billa Ganneru : మనం ఇంటి ముందు అలంకరణ కోసం అనేక రకాల పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. ఇంటి ముందు పెంచుకోవడానికి వీలుగా ఉండే మొక్కల్లో బిళ్ల గన్నేరుమొక్క కూడా ఒకటి. ఈ మొక్క మనకు ఎక్కడ పడితే అక్కడ కనబడుతుంది. కేవలం అలంకరణకే కాకుండా ఈ మొక్క ఔషధంగా కూడా మనకు ఉపయోగపడుతుంది. మనకు వచ్చే వివిధ అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ మొక్కను ఔషధంగా ఉపయోగిస్తారు. బిళ్ల గన్నేరు మొక్కను ఉపయోగించి ఏయే అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో.. ఇప్పుడు తెలుసుకుందాం.
మనకు గాయాలు తగిలినప్పుడు ఈ బిళ్ల గన్నేరు మొక్క ఆకులను ముద్దగా నూరి గాయంపై ఉంచడం వల్ల గాయాల నుండి రక్తం కారడం ఆగుతుంది. ఇలా ఉంచడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. శరీరంలో వేడి ఎక్కువైనప్పుడు ముక్కు నుండి రక్తం కారుతుంది. అలాంటప్పుడు బిళ్ల గన్నేరు పువ్వులను, దానిమ్మ చెట్టు మొగ్గలను కలిపి నూరి రసాన్ని తీయాలి. ఆ రసాన్ని ముక్కు రంధ్రాలలో రెండు చుక్కల చొప్పున వేయాలి. ఇలా వేయడం వల్ల ముక్కు నుండి రక్తం కారడం ఆగుతుంది. ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యలల్లో షుగర్ వ్యాధి కూడా ఒకటి. షుగర్ వ్యాధిని తగ్గించే ఔషధ గుణాలు బిళ్ల గన్నేరు మొక్కలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వారు రోజూ ఉదయం పరగడుపున రెండు బిళ్ల గన్నేరు మొక్క ఆకులను, పువ్వులను తినడం వల్ల షుగర్ వ్యాధి క్రమంగా తగ్గుతుంది.
అంతేకాకుండా ఈ మొక్క వేరును శుభ్రంగా కడిగి ఎండబెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. రోజూ రెండు పూటలా భోజనం చేసిన తరువాత ఈ పొడిని అర టీ స్పూన్ మోతాదులో తీసుకుని దానికి అర టీ స్పూన్ తేనెను కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకున్నా కూడా షుగర్ వ్యాధి తగ్గు ముఖం పడుతుంది. అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు బిళ్ల గన్నేరు మొక్క ఆకులను దంచి రసాన్ని తీసుకోవాలి. ఈ రసాన్ని రోజూ ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుంటూ ఉండడం వల్ల బీపీతోపాటు గుండె సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. రక్తనాళాల్లో ఉండే కొవ్వు కరిగి హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.
ఈ ఆకుల రసాన్ని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడడంతోపాటు కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా బిళ్ల గన్నేరు మొక్క ఆకుల రసాన్ని తాగడం వల్ల పలు రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. బిళ్ల గన్నేరు మొక్క వేరు రసాన్ని తీసుకుని దానికి తేనెను కలిపి ఇస్తే మద్యం సేవించేవారు ఆ అలవాటును క్రమంగా మానేస్తారు. ముఖంపై మొటిమలు, మచ్చలతో బాధపడే వారు బిళ్ల గన్నేరు ఆకులను, వేప చెట్టు ఆకులను సమపాళ్లలో తీసుకుని పొడిలా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని తగిన మోతాదులో తీసుకుని దానికి పసుపును, నీళ్లను కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి రాసుకుని ఒక గంట తరువాత కడిగేయాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.
మానసిక ఒత్తిడి కారణంగా బాధపడుతున్న వారు ఈ మొక్క పూలను సేకరించి దంచి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని ఒక టీ స్పూన్ మోతాదులో రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల ఒత్తిడి తగ్గి చక్కగా నిద్రపోతారు. వర్షాకాలంలో పురుగులు, కీటకాలు ఎక్కువగా బయటకు వస్తాయి. అవి అనుకోకుండా మనల్ని కుట్టినప్పుడు చర్మంపై దురదలు, దద్దుర్లు వంటివి వస్తాయి. ఈ బిళ్ల గన్నేరు మొక్క ఆకుల రసాన్ని పురుగులు, కీటకాలు కుట్టిన చోట రాయడం వల్ల దురదుల, దద్దుర్లు తగ్గుతాయి. ఈ విధంగా బిళ్ల గన్నేరు మొక్క మనకు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.