Cardamom : మనం వంటింట్లో అనేక రకాల తీపి పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. తీపి పదార్థాలు చక్కని రుచిని, వాసనను కలిగి ఉండాలని మనం వాటి తయారీలో యాలకుల పొడిని వేస్తూ ఉంటాం. యాలకులు చక్కని వాసనను కలిగి ఉంటాయి. కేవలం తీపి పదార్థాల తయారీలోనే కాకుండా ఇతర వంటకాల్లో కూడా మనం వీటిని ఉపయోగిస్తాం. వంటల్లో యాలకులను ఉపయోగించడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. యాలకులు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. మనకు వచ్చే పలు రకాల అనారోగ్య సమస్యలను మనం యాలకులను ఉపయోగించి నయం చేసుకోవచ్చు. యాలకులను ఉపయోగించడం వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరంలో ఉండే కొవ్వును కరిగించడంలో, శరీరంలో జీవక్రియల రేటును పెంచడంలో యాలకులు మనకు సహాయపడతాయి. యాలకుల పొడిని కొద్ది మోతాదులో ప్రతిరోజూ తీసుకోవడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. మనం వంటింట్లో ఉపయోగించే మసాలా దినుసులన్నింటి కంటే కూడా యాలకులు ఎక్కువ వాసనను కలిగి ఉంటాయి. మనకు చిన్న యాలకులు, పెద్ద యాలకులు అనే రెండు రకాలు లభిస్తాయి. ఇవి రెండూ ఒకే విధమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. శరీరానికి చలువ చేసే గుణాన్ని యాలకులు కలిగి ఉంటాయి.
ఆయుర్వేదంలో శరీరంలోని నొప్పులను తగ్గించడంలో, ముక్కుకు సంబంధించిన చిక్సితలో వీటిని ఉపయోగిస్తారు. యాలకులను మెత్తగా నూరి నుదుటికి రాసుకోవడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. యాలకులతో కషాయాన్ని చేసుకుని తాగడం వల్ల దగ్గు తగ్గుతుంది. యాలకుల గింజలను నోట్లో వేసుకుని నములుతూ చప్పరించడం వల్ల నోట్లో ఉండే క్రిములు నశించి నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. యాలకులను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని గాయాలకు, పుండ్లకు లేపనంగా రాయడం వల్ల అవి త్వరగా మానుతాయి.
యాలకులను నోట్లో వేసుకుని నమలడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గు ముఖం పడతాయి. అంతేకాకుండా కడుపులో ఏర్పడిన పుండ్లు మానిపోతాయి. యాలకుల కషాయాన్ని తాగడం వల్ల వాంతులు తగ్గుతాయి. జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. యాలకుల పొడి, శొంఠి పొడి రెండూ కలిపి అర గ్రాము మోతాదుగా అయ్యేలా తీసుకోవాలి. ఈ పొడికి కొద్దిగా తేనెను కలిపి తీసుకోవడం వల్ల కఫం తొలగిపోతుంది. యాలకులను వాసన చూడడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఈ విధంగా యాలకులు మనకు వచ్చే అనేక రకాల సమస్యలను నయం చేస్తాయని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.