Dates : డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు తీసుకునే ఆహారం మీ శరీరంలోని ఇన్సులిన్ పై ప్రభావం చూపిస్తుంది. అలాగే ఆరోగ్యకరమైన పోషకాలున్న ఆహారం తీసుకోవడం వలన రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు ఖర్జూరం తినవచ్చా లేదా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఆ విషయం గురించి తెలుసుకుందాం.
ఖర్జూరంలో పోషకాలు అధికంగా ఉంటాయి. చాలామంది ఖర్జూరంని ఇష్టంగా తింటారు. అయితే డయాబెటిస్ ఉన్నవారు మితంగా తింటేనే మంచిది. ఖర్జూరంలో ఫైబర్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్లు ఎ, కె, బి-కాంప్లెక్స్ విటమిన్ లు సమృద్దిగా ఉంటాయి. ఖర్జూరంలో మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడంలో తోడ్పడుతుంది. రక్తపోటుతో బాధపడేవారు రోజూ 2 లేదా 3 ఖర్జూరాలను తింటే రక్తపోటు అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఖర్జూరంలోని ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
ఖర్జూరం తియ్యగా, కొలెస్ట్రాల్ లేకుండా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటుంది. కాబట్టి ఖర్జూరం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచదు. ఖర్జూరంలోని ఫైబర్ రక్తంలో చక్కెరను నెమ్మదిగా గ్రహించి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తుంది. దీంతో బరువు పెరిగే ప్రమాదం ఉండదు. అయితే డయాబెటిస్ ఉన్నవారు రోజుకి ఎన్ని ఖర్జూరాలు తినాలి అనే అనుమానం ఉంటుంది. రోజుకి 2 లేదా 3 ఖర్జూరాలు మాత్రమే తినాలి. ఏదైనా మితంగా తింటేనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఖర్జూరం తినటం వలన అలసట, నీరసం లేకుండా చురుకుగా ఉంటారు.