కొబ్బరి నీళ్లలో అనేక పోషకాలు ఉంటాయి. సహజంగానే వీటిని వేసవిలో దాహం తీర్చుకునేందుకు ఎక్కువగా తాగుతారు. ఇక అనారోగ్యాల బారిన పడిన వారు, శస్త్ర చికిత్సలు అయిన వారు శక్తిని పుంజుకునేందుకు, త్వరగా కోలుకునేందుకు కొబ్బరినీళ్లను తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే కొబ్బరి నీళ్లను రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగవచ్చా ? అంటే..
కొబ్బరినీళ్లను రోజులో ఏ సమయంలో అయినా తాగవచ్చు. ఉదయం పరగడుపున కూడా తాగవచ్చు. అయితే పరగడుపున తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. కొబ్బరినీళ్లను పరగడుపున తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
* సాధారణంగా ఉదయం నిద్ర లేచిన వెంటనే మన శరీర మెటబాలిజం తక్కువగా ఉంటుంది. కానీ కొబ్బరి నీళ్లను తాగడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. అధిక బరువు తగ్గడం సులభతరం అవుతుంది.
* డీహైడ్రేషన్ సమస్య ఉన్నవారు, రోజంతా బయట తిరిగే వారు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లను తాగడం మంచిది. దీంతో అతి దాహం కాకుండా ఉంటుంది.
* కడుపు ఉబ్బరం సమస్య ఉన్నవారు రోజూ ఉదయాన్నే పరగడుపునే కొబ్బరినీళ్లను తాగడం వల్ల ఫలితం ఉంటుంది.
* కండరాలు పట్టేసే సమస్య ఉన్నవారు పరగడుపునే కొబ్బరినీళ్లను తాగుతుండాలి. కాలి పిక్కలు పట్టేయడం తగ్గుతుంది. కొబ్బరినీళ్లలో ఉండే పొటాషియం ఆ సమస్యను తగ్గిస్తుంది.
* రోజూ పరగడుపునే కొబ్బరినీళ్లను తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది.
* డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు ఉన్నవారు కొబ్బరినీళ్లను తాగితే మానసిక ప్రశాంతత లభిస్తుంది.
* గాల్ స్టోన్స్ (పిత్తాశయంలో రాళ్లు) సమస్య ఉన్నవారు కొబ్బరినీళ్లను తాగితే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
* ఉదయం లేవగానే నీరసంగా ఉందని భావించే వారు కొబ్బరినీళ్లను తాగితే శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. రోజంతా యాక్టివ్‌గా పనిచేస్తారు.