ఆకు కూరల్లో పాలకూర చాలా అధికమైన పోషకాలు కలిగినది. ఇందులో విటమిన్ ఎ, సి, కెరోటీన్, ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్‌లు ఉంటాయి. అందువల్ల పాలకూరను తినడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
పాలకూరలో కెరోటీన్ అధికంగా ఉంటుంది. 100 గ్రాముల పాలకూరను తింటే దాదాపుగా 2920 మైక్రోగ్రాముల కెరోటీన్ లభిస్తుంది.
పాలకూరలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. 100 గ్రాముల పాలకూరను తింటే 32 మిల్లీగ్రాముల విటమిన్ సి లభిస్తుంది.
హార్వార్డ్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనం ప్రకారం.. మధ్య వయస్కులు, వృద్ధులు పాలకూరను వారంలో 2 నుంచి 4 సార్లు తింటే కంటి చూపు మెరుగుపడుతుందని తేలింది. అలాగే మతిమరుపు సమస్య తగ్గుతుంది.
పాలకూరను తినడం వల్ల ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. దీంతో జీర్ణవ్యవస్థలో ఉండే సూక్ష్మ క్రిములు చనిపోతాయి. జీర్ణ రసాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు ఖర్చవుతాయి. అధిక బరువు తగ్గుతారు.
అయితే పాలకూరను ఆరోగ్యవంతులు రోజూ తినవచ్చు. రోజూ కూరగా చేసుకుని పాలకూరను తినలేమని అనుకుంటే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక కప్పు పాలకూర జ్యూస్‌ను తాగవచ్చు. ఇక కిడ్నీ స్టోన్లు ఉన్నవారు వారంలో 1 సారి పాలకూరను తినవచ్చు.