ప్రశ్న: నా మూత్ర పిండాల్లో రాళ్లు ఉన్నాయి. తీవ్ర నొప్పితో బాధ పడుతున్నా. ఇప్పుడు నేను ఎలాంటి ఆహారం తీసుకోవాలి ? ఆరోగ్యం మెరుగు పడాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి ?
మూత్రం ద్వారా మన శరీరంలోని మలినాలు ద్రవ రూపంలో బయటకు వెళ్తాయి. మూత్రం సక్రమంగా తయారై ఎప్పటికప్పుడు బయటకు వెళ్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అలా కాకుండా కొందరిలో కొన్ని రకాల పదార్థాలు మూత్ర పిండాల్లోనే గట్టిగా, చిన్న రేణువుల్లా పేరుకుపోతాయి. శరీర తత్వం, జీవనశైలి, ఆహారపు అలవాట్లు తదితరాలు మూత్ర పిండాల్లో రాళ్లకు కారణమవుతుంటాయి. మూత్ర పిండాల్లో రాల్లు బయటికి పోయేలా చూసుకోవడమే కాదు, కొత్తవి తయారు కాకుండా జాగ్రత్త పడాలి.
* శారీరక శ్రమ చేయాలి. వాకింగ్ వంటివి చేయాలి.
* పవన ముక్తాసనం, భుజంగాసనం, ధనురాసనం, హలాసనం వేస్తే రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి.
* రోజుకు రెండు పూటలా 2 లేదా 3 టీస్పూన్ల తులసి ఆకుల రసంలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే మూత్ర పిండాల్లో రాళ్లు బయటకు వస్తాయి.
* మొక్కజొన్న పొత్తులపై ఉండే పీచును 40 గ్రాముల మోతాదులో తీసుకుని దాన్ని అర లీటరు నీటిలో 5 గంటల పాటు నానబెట్టాలి. అనంతరం ఆ పీచును వడకట్టి ఆ నీటిని తాగాలి. ఇలా నిత్యం చేస్తే సమస్య తగ్గుతుంది.
* పల్లేరు కాయల రసం లేదా కషాయం నిత్యం తీసుకుంటుంటే మూత్రం ద్వారా రాళ్లు బయటకు వెళ్లిపోతాయి.
* మూత్ర పిండాల్లో రాళ్లు ఉన్న వారు మాత్రమే కాదు, అవి వచ్చి పోయిన వారు కూడా ప్రతి గంటకు ఒక గ్లాస్ నీటిని తాగాలి.
* నిత్యం కొబ్బరినీళ్లు, పలుచని మజ్జిగను తీసుకుంటే మేలు.
* తాజా పండ్లు, కూరగాయలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి.
* టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, చాక్లెట్లు, ఐస్ క్రీములు, పాలకూర, బాదం పప్పు, వేరుశెనగ పప్పు, టమాటాలు, మాంసాహారాలు తదితర పదార్థాలను చాలా తక్కువగా తీసుకోవాలి. వీలుంటే మానేయాలి.
– డాక్టర్ గాయత్రీ దేవి.