Fruits : మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయడం ఎంత అవసరమో.. అలాగే సరైన డైట్‌ను పాటించడం కూడా అంతే అవసరం. రోజూ అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. పోషకాహార లోపం ఏర్పడకుండా ఉంటుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి. అయితే మనకు అనేక పోషకాలను అందించడంలో పండ్లు చాలా కీలకపాత్ర పోషిస్తాయి. కనుక మనకు అందుబాటులో ఉండే పండ్లను తింటుండాలి. వీటితోపాటు సీజనల్‌గా లభించే పండ్లను కూడా తినాలి. అప్పుడే మనం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటాం.
అయితే పండ్లు ఆరోగ్యకరమైనవి కదా.. మరి వాటిని ఒక వారం రోజుల పాటు తింటే.. ఇతర ఏ ఆహారాలను తీసుకోకుండా కేవలం పండ్లను మాత్రమే వారం రోజుల పాటు తింటే.. ఏమవుతుంది ? అసలు అలా తినవచ్చా ? ఇందుకు నిపుణులు ఏమంటున్నారు ? అంటే..
పండ్లు మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. అవి మన డైట్‌లో ముఖ్యమైన భాగం. వాటిల్లో అనేక రకాల విటమిన్లు, మినరల్స్, డైటరీ ఫైబర్, కార్బొహైడ్రేట్లు, సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కనుక పండ్లను తినడం అన్ని విధాలా శ్రేయస్కరం. అయితే పండ్లలో ప్రోటీన్లు ఉండవు. చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. దీంతోపాటు కొవ్వులు, విటమిన్ బి1, బి12, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, జింక్, ఐరన్ వంటి మినరల్స్ కూడా చాలా సూక్ష్మ పరిమాణంలో పండ్లలో ఉంటాయి. కానీ ఇవి మనకు రోజూ అవసరం.
ప్రోటీన్లు మనకు రోజూ పెద్ద మొత్తంలో అవసరం అవుతాయి. కనుక రోజూ ప్రోటీన్లు ఉండే ఆహారాలను కూడా తీసుకోవాలి. కానీ వాటిని మానేసి పూర్తిగా పండ్లనే తింటే మనకు ప్రోటీన్ల లోపం ఏర్పడుతుంది. కనుక పూర్తిగా పండ్లనే తీసుకోవడం కూడా మంచిది కాదు. ఇది అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కానీ రోజులో మనం తీసుకునే ఆహారంలో కార్బొహైడ్రేట్ల పరిమాణాన్ని తగ్గించి అంత మొత్తంలో పండ్లను తినవచ్చు. దీంతోపాటు మనం రోజూ తీసుకునే ఇతర ఆహారాలను కూడా తీసుకోవాలి. ఈ క్రమంలో మన శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. ఆరోగ్యంగా ఉండవచ్చు. అంతేకానీ.. ఇతర అన్ని ఆహారాలను మానేసి కేవలం పండ్లనే తింటామంటే కుదరదు. దాంతో ప్రోటీన్లు, ఇతర పోషకాల లోపం ఏర్పడుతుంది. అది అనారోగ్యాలకు దారి తీస్తుంది. కనుక కేవలం పండ్లనే కాకుండా ఇతర ఆహారాలను కూడా రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.