Covid 19 : గత 2 సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టిస్తున్న వినాశనం అంతా ఇంతా కాదు. దీని వల్ల ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. తగ్గినట్లే తగ్గి మళ్లీ కొత్త కొత్త రూపాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు సైంటిస్టులు రాత్రి, పగలు అనే తేడా లేకుండా శ్రమిస్తూనే ఉన్నారు.
ఇక కరోనా మళ్లీ కొత్త రూపంలో దాడి చేస్తోంది. సౌతాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియెంట్‌ను తొలుత గుర్తించారు. ఈ క్రమంలోనే ఈ వేరియెంట్ డెల్టా వేరియెంట్ కన్నా ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో అన్ని రకాల జాగ్రత్తలను తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మన దేశంలోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విదేశాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలను విధించి అమలు చేస్తున్నాయి.
కాగా ఇలాంటి క్లిష్ట సమయంలో సైంటిస్టులు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. కరోనాను నోట్లోనే నాశనం చేసే ఓ నూతన తరహా చూయింగ్ గమ్‌ను వారు రూపొందించారు. ఇందులో ఏసీఈ2 అనే ప్రోటీన్ ఉంటుంది. అందువల్ల ఈ చూయింగ్ గమ్‌ను నోట్లో వేసుకుని నమిలితే.. కోవిడ్ వచ్చిన వారిలో నోట్లో ఉండే వైరస్‌లో దాదాపుగా 95 శాతం మేర వైరస్ ఆ చూయింగ్ గమ్‌లో చిక్కుకుపోయి బందీగా మారుతుంది. దీంతో వారు మాట్లాడినా, దగ్గినా, తుమ్మినా.. వైరస్ బయటకు వచ్చి ఇతరులకు ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. దీని వల్ల కోవిడ్ వ్యాప్తికి సమూలంగా అడ్డుకట్ట వేయవచ్చు.
అయితే ఈ చూయింగ్ గమ్‌ను ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన సైంటిస్టులు ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలో దీన్ని వాణిజ్య పరంగా ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే కోవిడ్ వచ్చిన వారు దీన్ని నమలాల్సి ఉంటుంది. దీంతో ఇతరులకు కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశాలు అమాంతం తగ్గిపోతాయి. కరోనాను సమూలంగా నాశనం చేయవచ్చు.