Salt : రోజూ మనం చేసే అనేక రకాల వంటల్లో ఉప్పు, కారం వేస్తుంటాం. అయితే కారం వేయకుండా కొన్ని వంటలను చేస్తాం.. కానీ ఉప్పు వేయకుండా మాత్రం ఏ వంటకాన్ని పూర్తి చేయం. ఎందుకంటే ఉప్పు వేయకపోతే అసలు రుచి రాదు. కూరలు రుచిగా ఉండాలంటే ఉప్పు ఆ మాత్రం పడాలి. అయితే కూరల్లో వేసే ఉప్పు సరిపోదని చెప్పి కొందరు ఎక్కువ ఉప్పు కలుపుకుని తింటుంటారు. అలాగే కొందరు పెరుగు, మజ్జిగ వంటి వాటిలోనూ ఉప్పు కలిపి తీసుకుంటుంటారు. కానీ వాస్తవానికి మనం ఉప్పును అధికంగా తీసుకోకూడదని.. తీసుకుంటే అనేక ప్రాణాంతక వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఉప్పును తగ్గించుకోవాలని అంటున్నారు.
ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగిపోతాయి. దీంతో దీర్ఘకాలంలో కిడ్నీ వ్యాధులు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే కిడ్నీలు చెడిపోయేందుకు కూడా చాన్స్ ఉంటుంది. ఇక దీంతోపాటు రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో రక్తపోటు కూడా పెరుగుతుంది. అప్పుడు హైబీపీతో ఇబ్బందులు పడతారు. ఇది గుండె జబ్బులకు, హార్ట్ ఎటాక్‌లకు దారి తీస్తుంది. అలాగే ఉప్పు ఎక్కువగా తినడం వల్ల జీర్ణాశయ క్యాన్సర్ వచ్చేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఇక ఉప్పును మోతాదుకు మించి తింటే దీర్ఘకాలంలో ఎముకలు పెళుసుగా మారిపోతాయి. దీంతో వృద్ధాప్యంలో చిన్న దెబ్బ తగిలినా చాలు.. ఎముకలు సులభంగా విరిగిపోతాయి. మళ్లీ అతుక్కుపోవడం కూడా కష్టమే. కనుక ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల ఎన్నో అనర్థాలు సంభవిస్తాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇక మనం రోజుకు 5 గ్రాములు లేదా ఒక టీస్పూన్ మోతాదులో మాత్రమే ఉప్పును తినాలి. అంతకన్నా మించకూడదు. కానీ గణాంకాలు చెబుతున్న ప్రకారం మనం రోజుకు సరాసరి 11 గ్రాముల మేర ఉప్పును తింటున్నామట. ఇది షాకింగ్‌గా అనిపిస్తున్న పచ్చి నిజం. కనుక మనం వాస్తవాలను తెలుసుకుని నడుచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం రోజువారీ తీసుకునే ఉప్పును సగానికి సగం తగ్గించాలి. అప్పుడే మనం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటాం. లేదంటే ఇబ్బందులు తప్పవు.. అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.