నేటి రోజుల్లో ఒత్తిడి అధికమైంది, జీవన విధానాలు మారాయి. ఆహారం మార్పు చెందింది. గుండె పోట్లు అధికమవుతున్నాయి. గుండె పోట్ల మరణాలు పరిశీలిస్తే, ఇవి చాలా వరకు ఉదయం వేళలోనే జరుగుతున్నట్లు స్టడీలు చెపుతున్నాయి. సాయంత్రాలు లేదా ఇతర సమయాలలో గుండెపోటు మరణాలు తక్కువగా వున్నాయి. ఉదయం వేళ గుండెపోటు మరణాలకు కారణాలు పరిశీలిస్తే.. శరీరానికి ఉదయం వేళ అవసరమైన ఆక్సిజన్ డిమాండు , సరఫరాలలో సమతుల్యత లోపిస్తుందంటారు డా. రాబర్ట్ మాన్ ఫ్రెడ్డిని. ఉదయంవేళలో శరీరానికి అవసరమైన పనులు అంటే మేల్కొనటం, పక్క ఎత్తటం, వంటచేయటం లాంటి చర్యలకు అధిక ఆక్సిజన్ కావాలి.
అడ్రినల్ హార్మోన్ కార్టిసోల్ అనే హార్మోను ఈ సమయంలో అధిక రక్తపోటును కలిగిస్తుంది. దానితో శరీరం అధిక ఆక్సిజన్ కోరటం అదే సమయంలో రక్తనాళాలు గుండెకు సరఫరా అయ్యే ఆక్సిజన్ ను ఆపేయటం కాదుగాని తగ్గించటం వంటివి జరుగుతుంది. ఆక్సిజన్ సరఫరాలోని ఈ అసమతుల్యత ఉదయంవేళ గుండెపోట్లకు కారణమవుతోంది. శరీరం అలవాటు పడటానికి గాను ఉదయం వేళ ప్రతిపనికి కొంత సమయం తీసుకోవాలని పరిశోధకులు చెపుతున్నారు.
అంతేకాక ఉదయంవేళ శరీరంలోని ఫిబ్రినాలిసిస్ తక్కువ స్ధాయిలో పని చేస్తుంది. అప్పటిదాకా శరీరం విశ్రాంతిలో వుండటంతో రక్తం గడ్డలు రక్తనాళాలను అడ్డగిస్తాయి. వీటిని కరిగించేందుకు ఫిబ్రినాలిసిస్ పనిచేయాలి. ఉదయంవేళ ఇది తక్కువస్ధాయిలో పనిచేస్తుంది. కనుక రక్తం గడ్డలు అన్నీ కరగవు. ఇది గుండెకు రక్తసరఫరాను అడ్డగిస్తుంది. మరోవైపు ఉదయం వేళ పనులంటూ శరీరం అధిక ఆక్సిజన్ కోరుతుంది. ఈరకంగా రక్త ప్రసరణ తగ్గటం శరీరం రక్తప్రసరణ అధికంగా కోరటంతో తప్పని సరిగా గుండెపోటు వచ్చి మరణాలకు దారితీస్తోందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.