చిన్నారులకు తమ తల్లితండ్రులు నిత్యం బాదంపప్పును తినిపిస్తుంటారు. నిత్యం 5 నుంచి 6 బాదం పప్పును రాత్రి పూట నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌తో కలిపి ఆ బాదంపప్పును తినిపిస్తారు. నీటిలో నానే ఆ బాదంపప్పుల పొట్టు తీసి వారు తమ పిల్లలకు పెడతారు. ఇలా చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని, మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఇది నిజమేనా ? దీనిపై సైంటిస్టుల పరిశోధనలు ఏమంటున్నాయి ? వైద్య నిపుణులు దీని గురించి ఏం చెబుతున్నారు ? అంటే…
న్యూట్రిషన్ అండ్ ఏజింగ్ అనే జర్నల్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం.. బాదంపప్పును నిత్యం తినడం వల్ల మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. బాదంపప్పును బ్రెయిన్ ఫుడ్‌గా చెబుతారు. ఈ పప్పులో ఉండే విటమిన్ ఇ, ఫోలేట్, ఫైబర్ తదితర పోషకాలు మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. బాదంపప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడులో వాపులు రాకుండా చూస్తాయి. అలాగే వయస్సు మీద పడడం వల్ల సహజంగానే చాలా మందికి మతిమరుపు వస్తుంది. దీంతోపాటు జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుంది. అలాంటి వారు బాదం పప్పును నిత్యం తినడం వల్ల ఆయా సమస్యలు రాకుండా చూడవచ్చు.
ఇక వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం.. బాదంపప్పులో ఎసిటైల్‌కోలిన్ (ఏసీహెచ్) అనే సమ్మేళనం ఉంటుంది. దీన్నే న్యూరో ట్రాన్స్‌మిటర్ అని అంటారు. ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అలాగే అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా చూస్తుంది. అందువల్ల చిన్నారులు అయితే నిత్యం 5 నుంచి 6, పెద్దలు అయితే నిత్యం 8 నుంచి 10 బాదంపప్పును రాత్రి పూట నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయాన్నే వాటి పొట్టు తీసి వాటిని బ్రేక్‌ఫాస్ట్‌తో కలిపి తీసుకోవాలి. దీంతో జ్ఞాపకశక్తి పెరగడమే కాక, ఇతర మెదడు సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి.