Diwali Oil : హిందువులు జరుపుకొనే అతి పెద్ద పండుగలలో దీపావళి పండుగ ఒకటి. దీపావళి పండుగ రోజున ప్రతి ఒక్కరూ వారి ఇంటిని రంగు రంగుల ముగ్గులతో, దీపాలను వెలిగించి ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే పురాణాల ప్రకారం సముద్రగర్భం నుంచి లక్ష్మీ దేవి దీపావళి పండుగ రోజు ఉద్భవించడం వల్ల ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటునట్లు పురాణాలు చెబుతున్నాయి.
అదేవిధంగా పూర్వం ప్రజలను ఎన్నో చిత్రహింసలకు గురి చేసిన నరకాసురుడిని సత్యభామ చంపడం వల్ల సంతోషంతో ప్రజలు దీపావళి పండుగను జరుపుకున్నట్లు చెబుతారు. 14 సంవత్సరాలు వనవాసం చేసిన శ్రీరాముడు ఎన్నో అష్టకష్టాలు పడి తిరిగి దీపావళి పండుగ రోజు సీతా సమేతంగా అయోధ్యకు రావడం వల్ల అయోధ్య ప్రజలు ఎంతో ఆనందంతో వారికి దీపాలతో స్వాగతం పలికారని అందుకోసమే దీపావళి పండుగ రోజు దీపాలను వరుసగా అమర్చుకుని ఈ పండుగను జరుపుకున్నారని పురాణాలు చెబుతున్నాయి.
దీపావళి పండుగ రోజు దీపాలను వెలిగించడానికి ఏ విధమైన నూనెను ఉపయోగించాలి అనే విషయానికి వస్తే.. చాలామంది దీపాలలో చమురు లేదా నెయ్యి, ఆవ నూనెను ఉపయోగిస్తారు. కానీ దీపావళి పండుగ రోజు దీపాలను వెలిగించడానికి అవిసె నూనె ఎంతో ముఖ్యమైనది.
అవిసె నూనెతో దీపాలను వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందటమే కాకుండా రాహుకేతువుల దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అందువల్ల దీపాలను వెలిగించేందుకు అవిసె నూనెను ఉపయోగించాలి.