జస్‌ప్రిత్ బుమ్రా.. క్రికెట్ ఫ్యాన్స్‌కు ఈ పేరు చెబితే చాలు.. శరీరంలో ఏవో తెలియని గూస్ బంప్స్ వస్తాయి. ఫార్మాట్ ఏదైనా సరే.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ పరుగులు చేయకుండా కట్టడి చేయడంలో బుమ్రా దిట్ట అని చెప్పవచ్చు. మేటి జట్టుగా పేరున్న ఆసీస్ ప్లేయర్లే బుమ్రా బౌలింగ్‌కు భయపడతారు.. అంటే అతిశయోక్తి కాదు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్‌లో బుమ్రా ప్రదర్శన అద్భుతం. బుమ్రా ప్రస్తుతం టీమిండియాకు వన్డేలు, టెస్టులు ఆడుతున్నాడు. అలాగే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కు ఆడుతున్నాడు. అయితే సోషల్ మీడియాలో ఆయనకు చెందిన కొన్ని విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
బుమ్రా ప్రస్తుతం బీసీసీఐ అందిస్తున్న గ్రేడ్ ఎ కాంట్రాక్టులో కొనసాగుతున్నాడు. ఇందుకు గాను ఆయనకు ఏడాదికి బీసీసీఐ రూ.5 కోట్ల వేతనం అందిస్తోంది. ఇక ఆడే మ్యాచ్‌ను బట్టి మ్యాచ్ ఫీజు కూడా ఉంటుంది. అలాగే ఐపీఎల్ ఆడుతున్నాడు. దీంతోపాటు పలు బ్రాండ్స్‌ను కూడా ఆయన ప్రమోట్ చేస్తున్నాడు. ఇలా బుమ్రా ఆదాయం పరంగా బాగానే సంపాదిస్తున్నాడని చెప్పవచ్చు. బుమ్రా ఐపీఎల్‌లో ఒక సీజన్‌కు గాను రూ.18 కోట్లను పొందుతున్నాడు. అలాగే ఒక యాడ్‌లో నటిస్తే రూ.2 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నాడట. ఇక ఆయన భార్య సంజనా గణేశన్ ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆమె ఆస్తి విలువ సుమారుగా రూ.8 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.
ఒక టెస్ట్ మ్యాచ్ భారత్ తరఫున ఆడితే బుమ్రా రూ.15 లక్షలు తీసుకుంటుండగా, వన్డే మ్యాచ్ కు రూ.7 లక్షలు, టీ20కి రూ.3 లక్షలను తీసుకుంటున్నాడు. బుమ్రాకు ముంబై, అహ్మదాబాద్‌లలో రూ.4 కోట్లు విలువ చేసే ఇళ్లు ఉన్నాయి. ఆయన వద్ద ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. మెర్సిడెస్ మేబ్యాక్, రేంజ్ రోవర్ వేలార్, నిస్సాన్ జీటీ ఆర్ వంటి లగ్జరీ కార్లు ఆయన వద్ద ఉన్నాయి. ఇక ప్రస్తుత అంచనాల ప్రకారం బుమ్రా ఆస్తి విలువ రూ.100 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.