TV Channel Code : ఇప్పుడు ప్రేక్షకులు టీవీలు కూడా కాదు.. ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. అప్పట్లో టీవీల్లోనే సినిమాలను చూసేవారు. కొత్త సినిమా టీవీలో వచ్చేందుకు చాలా సమయమే పట్టేది. తరువాత ఆ సమయం తగ్గింది. కానీ ఓటీటీలు రావడంతో టీవీల్లో కొత్త సినిమాలను చూసే వారి సంఖ్య తగ్గిందనే చెప్పవచ్చు. ఇక ఇంటర్నెట్ కూడా ఉండడంతో టీవీలను చూసేవారి సంఖ్య ఇంకా తగ్గింది. అయితే టీవీలను పెట్టుకుంటున్నారు. కానీ వాటిల్లో యూట్యూబ్, ఓటీటీ యాప్స్ వంటివి చూస్తున్నారు. చానల్స్ చూసే వారు తగ్గిపోయారు.
అయితే టీవీ చానల్స్‌ను మనం చూసేటప్పుడు ఏ చానల్ అయినా సరే.. ఒక్కోసారి తెరపై మనకు ఒక కోడ్ కనిపిస్తుంటుంది. ఆ కోడ్ వచ్చి కాసేపు తెరపై ఉండి ఆ తరువాత మాయమవుతుంది. అయితే అది ఏ కోడ్.. అసలు అది అలా ఎందుకు వస్తుంది.. దాంతో ఏం ఉపయోగం.. వంటి విషయాలను ఎప్పుడైనా ఆలోచించారా.. అయితే ఆ కోడ్‌కు అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
టీవీ చానల్స్ పైరసీని అరికట్టేందుకు, కాపీరైట్ ఉల్లంఘించే వారిని పట్టుకునేందుకు గాను ఆ కోడ్‌లను ఉపయోగిస్తుంటాయి. ఆ కోడ్ ఒక్కో చానల్‌కు వేర్వేరుగా ఉంటుంది. అయితే ఆ కోడ్ తెరపై ప్రత్యక్షమైన సమయంలో ఎవరైనా ఆ చానల్‌లో ప్రసారం అవుతున్న వీడియోను రికార్డింగ్ చేసి దాన్ని ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తే.. అప్పుడు సదరు టీవీ చానల్ వారు ఆ కోడ్ ను ఉపయోగించి తమ వీడియోను కాపీ చేసిన వారిని సులభంగా ట్రాక్ చేయగలుగుతారు. అందుకనే మనకు ఏ టీవీ చానల్ చూసినా సరే తెరపై అప్పుడప్పుడు అలా భిన్న రకాల కోడ్‌లు కనిపిస్తుంటాయి. ఇదీ.. వాటి వెనుక ఉన్న అసలు విషయం.