టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరో రెండు నూతన 4జీ ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసింది. గతేడాది జియో భారత్, జియో భారత్ వి2 పేరిట రెండు ఫోన్లను లాంచ్ చేసిన విషయం విదితమే. ఇప్పుడు ఇదే సిరీస్‌లో మరో రెండు నూతన ఫోన్లను తాజాగా ప్రవేశపెట్టింది. జియో భారత్ వి3, జియో భారత్ వి4 పేరిట ఈ 4జీ ఫీచర్ ఫోన్లను జియో లాంచ్ చేసింది. జియో భారత్ వి3 ఫీచర్ ఫోన్‌ను స్టైల్ సెంట్రిక్‌గా తీర్చిదిద్దారు. ఇది స్లీక్, మోడ్రన్ డిజైన్‌ను కలిగి ఉంది. ఫ్యాషనబుల్‌గా కూడా ఉంటుంది.
జియో భారత్ వి4ను డిజైన్ ఫోకస్డ్ ఫోన్‌గా తీర్చిదిద్దారు. ఇందులో కట్టింగ్ ఎడ్జ్ డిజిటల్ సేవలను అందిస్తున్నారు. రెండు ఫోన్లలోనూ యూజన్లకు 1000 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్లలో 23 భారతీయ భాషలకు సపోర్ట్ లభిస్తోంది. జియో భారత్ వి3, జియో భారత్ వి4 ఫోన్లలో జియోకు చెందిన ఎక్స్‌క్లూజివ్ సేవలను పొందవచ్చు.
ఈ ఫోన్‌లలో జియో టీవీ, జియో సినిమా యాప్‌లను పొందవచ్చు. జియో పే ద్వారా యూపీఐ పేమెంట్లు చేయవచ్చు. జియో చాట్ ద్వారా మెసేజ్‌లను పంపుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ మెసేజ్‌లు, ఫొటోలు పంపుకోవచ్చు. గ్రూప్ చాట్ సదుపాయం కూడా ఉంది. ఈ ఫోన్లు రూ.1099 ధరకు లభిస్తున్నాయి. కేవలం రూ.123 నెలవారి రీచార్జితో ఈ ఫోన్లను ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 14జీబీ వరకు డేటా లభిస్తాయి. ఇక ఈ ఫోన్లు అన్ని రిలయన్స్ స్టోర్‌లలో, జియో మార్ట్‌లో, అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.