Amla Leaves : ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన వృక్షాలలో ఉసిరి చెట్టు ఒకటి. దీనిని ఇంగ్లీష్ లో గూస్ బెర్రీ అని, హిందీలో ఆమ్లా అని, స్స్కృతంలో ఆమ్లక అని పిలుస్తారు. ఈ ఉసిరి చెట్టు 8 నుండి18 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ చెట్టు గురించి మనకు ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఉసిరి చెట్టు ఆకులు చిన్నగా, ఆకు పచ్చ రంగులో కొమ్మలతో విస్తరించి ఉంటుంది. ఆధ్యాత్మికపరంగా కూడా ఉసిరి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కేవలం ఆధ్యాత్మికంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా ఉసిరి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వివిధ రకాల ఔషధాల తయారీలో కూడా ఉసిరి చెట్టును విరివిరిగా ఉపయోగిస్తారు. విటమిన్ సి అత్యధికంగా ఉండే వాటిల్లో ఉసిరికాయ ఒకటి. ఉసిరికాయను నేరుగా తిన్నా, వాటి జ్యూస్ తాగినా లేదా ఎండిన ఉసిరిని తీసుకున్నా మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
కేవలం ఉసిరికాయలే కాదు ఉసిరి చెట్టు ఆకులు, బెరడు, వేర్లు కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఉసిరికాయలు మనకు కొద్ది రోజులు మాత్రమే లభిస్తాయి. కానీ ఉసిరి చెట్టు ఆకులు,వేర్లు, బెరడు మనకు ఏడాది పొడవునా లభిస్తుంది. ఉసిరి చెట్టు వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుంటే మనం ఆశ్చర్యానికి గురికావాల్సిందే. ఉసిరి చెట్టు ఆకుల వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కడుపు నొప్పి, అజీర్తి, మలబద్దకం, గ్యాస్, ఎసిడిటి వంటి సమస్యలతో బాధపడే వారికి ఉసిరి ఆకుల జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఆకుల జ్యూస్ ను 10 ఎమ్ ఎల్ మోతాదులో ఒక గ్లాస్ మజ్జిగలో కలిపి తీసుకోవడం వల్ల మనం మంచి ఫలితాలను పొందవచ్చు. ఉసిరి ఆకుల జ్యూస్ ను రోజూ కొద్ది మోతాదులో తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

అలాగే ఈ ఆకులతో కషాయాన్ని చేసి తీసుకోవడం వల్ల బీపీ, షుగర్ వంటి వ్యాధులు నియంత్రణలో ఉంటాయి. నోటిపూత, నోటిలో అల్సర్ వంటి సమస్యలతో బాధపడే వారు ఉసిరి ఆకుల కషాయంలో కొద్దిగా ఉప్పు కలిపి నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల నోటిపూత, నోటిలో అల్సర్ వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఈ కషాయాన్ని గొంతులో పోసుకుని పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ ఉసిరి ఆకుల కషాయంతో గాయాలను, పుండ్లను కడుగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి.చర్మ సమస్యలతో బాధపడే వారు ఉసిరి ఆకులను కాల్చి బూడిద చేయాలి. ఈ బూడిదలో కొద్దిగా ఆవనూనెను కలిపి పేస్ట్ లాగా చేయాలి. ఈ పేస్ట్ ను చర్మ సమస్యలపై లేపనంగా రాయడం వల్ల మనం చక్కటి ఫలితాలను పొందవచ్చు.
అలాగే ముఖంపై మొటిమలు, మచ్చలు వంటి సమస్యలతో బాధపడే వారు ఉసిరి ఆకులను మెత్తగా నూరి అందులో ఒక టీ స్పూన్ తేనెను కలిపి ముఖంపై ప్యాక్ లా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు తగ్గుతాయి. ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఉసిరి ఆకులతో చేసిన కషాయాన్ని తాగడం వల్ల కాలేయంలో పేరుకుపోయిన మలినాలు, విష వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉసిరి ఆకుల రసాన్ని పరగడుపున తాగడం వల్ల కామెర్ల వ్యాధి తగ్గు ముఖం పడుతుంది. కళ్లు ఎర్రగా మారడం, కళ్ల మంటలు, కళ్ల నొప్పి వంటి సమస్యలతో బాధపడే వారు ఉసిరి ఆకుల కషాయంతో కళ్లను కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల వివిధ రకాల కంటి సమస్యలు తగ్గుతాయి. 10 గ్రాముల ఉసిరి ఆకులను తీసుకుని అందులో ఉప్పు కలిపి మెత్తగా నూరుకుని చప్పరిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆకలి పెరుగుతుంది.
ఉసిరి ఆకులను అలాగే ఉసిరి బెరడును కలిపి కషాయంలా చేసుకోవాలి. ఈ కషాయంతో జుట్టును శుభ్రపరుచుకోవడం వల్ల జుట్టు సంబంధిత సమస్యలన్నీ తగ్గుతాయి. జుట్టు కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఉసిరి బెరడును పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని దానికి ఒక టీ స్పూన్ తేనెను కలిపి రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి. గొంతులో పేరుకుపోయిన కఫం తొలగిపోతుంది. ఈ విధంగా ఉసిరికాయలతో పాటు ఉసిరి చెట్టు ఆకులు, బెరడు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయని వీటిని ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఫలితాలను పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.