మన చుట్టూ పరిసరాల్లో పెరిగే అనేక ఆయుర్వేద వృక్షాల్లో అశోక వృక్షం ఒకటి. ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ వృక్షం బెరడు, ఆకులు, విత్తనాలు, పువ్వులను అనేక ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అవి అనేక వ్యాధులను నయం చేయడంలో సహాయ పడతాయి. అశోక వృక్షం వల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
అశోక వృక్షానికి చెందిన ఆకులు, బెరడు, పువ్వులు, విత్తనాల్లో అనేక గుణాలు ఉంటాయి. నొప్పులను తగ్గించే అనాల్జెసిక్ గా అవి పనిచేస్తాయి. నాడీ మండల వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి, గుండె సంరక్షణకు, ప్రత్యుత్పత్తి వ్యవస్థ పనితీరుకు, విసర్జన వ్యవస్థకు, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు అవి ఉపయోగపడతాయి.
* అశోక వృక్షం ఆకులను పేస్ట్‌లా చేసి శరీర భాగాలపై రాస్తుంటే కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు తగ్గుతాయి. ఆ మిశ్రమం విషానికి విరుగుడుగా కూడా పనిచేస్తుంది.
* అశోక చెట్టు బెరడును నీటిలో వేసి మరిగించి ఆ నీటిని చల్లారాక ఆవనూనెతో కలిపి మొటిమలపై రాయాలి. ఇలా చేస్తుంటే మొటిమలు తగ్గుతాయి.
* ఒక కప్పు పాలలో అశోక చెట్టు బెరడు పొడి, బ్రాహ్మి పొడిలను ఒక టీస్పూన్ మోతాదులో కలిపి తాగుతుంటే తెలివితేటలు పెరుగుతాయి. రోజుకు రెండు సార్లు ఇలా తాగాలి.
* అశోక చెట్టు ఆకుల పేస్ట్‌ను రాస్తుంటే గాయాలు, పుండ్లు, మచ్చలు తగ్గుతాయి. చర్మం సురక్షితంగా ఉంటుంది.
* అశోక చెట్టు పువ్వులను తీసుకుని నలిపి రసం తీయాలి. దాన్ని అర టీస్పూన్ మోతాదులో కొద్దిగా నీటితో కలిపి తాగుతుండాలి. దీంతో ఇంటర్నల్ బ్లీడింగ్ తగ్గుతుంది. డయేరియా నుంచి బయట పడవచ్చు.
* అశోక చెట్టు బెరడులో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల ఆ బెరడును కషాయంలా చేసి తాగుతుంటే శరీరంలోని వాపులు, నొప్పులు తగ్గుతాయి. జీర్ణాశయంలో ఉండే పురుగులు చనిపోతాయి.
* అశోక చెట్టు బెరడు కషాయం తాగడం వల్ల పైల్స్ తగ్గుతాయి. షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
* అశోక చెట్టు విత్తనాల పొడిని కొద్దిగా తీసుకుని దాన్ని తమలపాకులో చుట్టి తింటుంటే ఆస్తమా తగ్గుతుంది. కిడ్నీ స్టోన్లు కరుగుతాయి.
* మహిళలకు వచ్చే సమస్యలకు అశోక వృక్షం భాగాలు ఎంతో ఉపయోగపడతాయి. కడుపు నొప్పిని తగ్గిస్తాయి. అందుకు గాను అశోక వృక్షం బెరడు, పువ్వులు, ఆకులను ఉపయోగించవచ్చు.
అశోక వృక్షం భాగాలతో తయారు చేసిన సిరస్ మనకు లభిస్తుంది. దాన్ని రోజుకు 10-15 ఎంఎల్ మోతాదులో తాగవచ్చు. విత్తనాల పొడి అయితే 1 నుంచి 3 గ్రాముల మేర తీసుకోవాలి. పువ్వుల పొడి అయితే 1 నుంచి 3 గ్రాములు తీసుకోవచ్చు. బెరడు కషాయం అయితే 15 నుంచి 30 ఎంఎల్ మోతాదులో తీసుకోవచ్చు.